BJP: కాంగ్రెస్‌ ఖాతాల్లో నగదు రూ.1000కోట్ల పైనే!

నిబంధనలకు విరుద్ధంగా వివిధ పాన్‌నంబర్లతో కాంగ్రెస్‌ పలు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తోందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పటేల్‌ విమర్శించారు.

Published : 24 Mar 2024 00:05 IST

దిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీ (Congress) చాలా బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తోందని భాజపా (BJP) ఆరోపించింది. పన్నులు చెల్లించలేదన్న కారణంతో అందులో మూడునాలుగింటిని మాత్రమే ఆదాయపు పన్ను శాఖ (IncomeTax) అటాచ్‌ చేసిందని పేర్కొంది. అంతే తప్ప ఆ ఖాతాలను ఫ్రీజ్‌ చేయలేదని వెల్లడించింది. తాజా ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఈ అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని మండిపడింది. ‘‘ మీ ఖాతాలను ఫ్రీజ్‌ చేయలేదు. ఆదాయపు పన్నుశాఖ కేవలం వాటిని అటాచ్‌ చేసింది. ఆయా ఖాతాల్లో మీరు డబ్బులు జమచేయొచ్చు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ప్రభుత్వానికి బకాయిపడిన రూ.125 కోట్ల మినహా మిగతా మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు’’ అని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పటేల్ మీడియాకు తెలిపారు.

దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వివిధ ఖాతాల్లో రూ.1000 కోట్లకు పైగానే నగదు ఉందన్నారు. ఆ పార్టీ తన సొంత రాజ్యాంగాన్నే ధిక్కరించి వివిధ పాన్‌ నంబర్లతో పలు ఖాతాలు తెరిచిందని విమర్శించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌కు రూ.500 కోట్ల విలువైన స్థిర ఆస్తులు కూడా ఉన్నాయని ఆరోపించారు. బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంతో కనీసం రైలు టికెట్లు కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేవని ఆ పార్టీ అగ్రనేతలు చెబుతుండటాన్ని పటేల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ విమర్శలు చేయకుండా, సాంకేతికంగా నమ్మదగిన సమాధానం చెప్పాలని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు