Rajasthan: అశోక్‌ గహ్లోత్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే భయం: రాజస్థాన్‌ భాజపా అధ్యక్షుడు

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot)పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీపీజోషీ (CP Joshi) మండిపడ్డారు. ఆయనకు ఆరెస్సెస్‌ (RSS) అంటే భయమని విమర్శించారు.

Published : 12 May 2023 12:44 IST

జైపుర్‌: రాజస్థాన్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష భాజపాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) గురువారం చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీ (CP Joshi) మండిపడ్డారు. గహ్లోత్‌కు ఆరెస్సెస్‌ (RSS) అంటే భయమని అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదులను గౌరవించడం, దేశభక్తులను దూషించడం వల్లే కాంగ్రెస్‌ పతనమైందని దుయ్యబట్టారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తనను నిరంకుశుడు (fascist) అని నిందిస్తున్నారని.. అందువల్ల ముఖ్యమంత్రి ఆత్మపరిశీలన చేసుకోవాలని చురకలు వేశారు.

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం గహ్లోత్‌ స్పందించారు. భాజపా, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)లపై విరుచుకుపడ్డారు. ‘‘భాజపా (BJP), ఆరెస్సెస్‌ నేతలు నిరంకుశులు. వారు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలను పడగొట్టారు. రాజస్థాన్‌లో బలమైన ప్రభుత్వం లేకపోతే మనకూ అదే పరిస్థితి వచ్చేది. ఇలాంటి వారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలి’’ అని విమర్శించారు. దీనిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీ ఘాటుగా స్పందించారు.

‘‘కాంగ్రెస్‌కు ఆరెస్సెస్‌ అంటే భయం. అందుకే వారు ఆ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అరెస్సెస్‌ కార్యకర్తలు వివక్ష లేకుండా ఓ సైన్యం వలే సమాజాన్ని రక్షించడానికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్‌ కేవలం ఒక కుటుంబానికే అంకితమై ముక్కలైపోయిన సంస్థ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని గహ్లోత్ భయపడుతున్నారు. రాహుల్‌ గాంధీ దృష్టిలో పడేందుకే ఆయన ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు’’ అని జోషీ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని