Lok Sabha Elections: ప్రధాని ధ్యానం.. కోడ్‌ ఉల్లంఘనే

లోక్‌సభ ఎన్నికల చివరి విడతకు ప్రచార గడువు గురువారం సాయంత్రం ముగిశాక కన్యాకుమారికి వెళ్లి మూడురోజులపాటు ధ్యానం నిర్వహించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది.

Published : 30 May 2024 03:50 IST

ఈసీకి విపక్షాల ఫిర్యాదు
టీవీల్లో ప్రసారం కాకుండా అడ్డుకోవాలని వినతి

దిల్లీ, కోల్‌కతా, కన్యాకుమారి: లోక్‌సభ ఎన్నికల చివరి విడతకు ప్రచార గడువు గురువారం సాయంత్రం ముగిశాక కన్యాకుమారికి వెళ్లి మూడురోజులపాటు ధ్యానం నిర్వహించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇంకా అమల్లోనే ఉందని, జూన్‌ ఒకటో తేదీన జరిగే పోలింగును ప్రభావితం చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని చేపట్టిన కార్యక్రమం ‘ఎన్నికల కోడ్‌’ ఉల్లంఘన కిందికే వస్తుందని, దీనిని నిలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ కోరింది. ఈ కార్యక్రమం వివిధ మాధ్యమాల్లో ప్రసారం కాకుండా అడ్డుకోవాలంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రణదీప్‌ సుర్జేవాలా, అభిషేక్‌ సింఘ్వి తదితరులు సీఈసీ రాజీవ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రచారంపై నిషేధం ఉన్నా ధ్యానం రూపంలో ప్రధాని దీనికి భంగం కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. కావాలంటే జూన్‌ ఒకటోతేదీ సాయంత్రం తర్వాత ధ్యానం చేసుకోవచ్చన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివిధ సభల్లో తమపై చేసిన నిరాధార ఆరోపణలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ధ్యానం దృశ్యాలు టీవీల్లో ప్రసారమైతే దానిపై తాను ఈసీకి ఫిర్యాదు చేస్తానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ధ్యానం చేయడానికి ఎవరైనా కెమెరాలు వెంట తెచ్చుకుంటారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రధాని ధ్యానం చేసుకోవడంపై ఎలాంటి నిషేధం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. ఎన్నికలు జరగబోయే ప్రాంతాల గురించి మాట్లాడనప్పుడు ఏ విధమైన నిషేధం వర్తించదని పేర్కొన్నాయి. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో 2019లోనూ చివరి దశలోనే పోలింగ్‌ జరిగిందని, ధ్యానానికి అప్పుడూ ఈసీ అనుమతించిందని గుర్తుచేశాయి.

2 వేలమంది పోలీసులతో మోదీకి భద్రత 

మోదీ చేయబోయే ధ్యానం దృష్ట్యా దాదాపు 2 వేల మంది పోలీసులతో గట్టి భద్రతాచర్యలు చేపట్టారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే బృందాలు కన్యాకుమారికి చేరుకున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే కాలంలో మూడు రోజుల ధ్యానానికి జిల్లా కలెక్టర్‌ అనుమతి ఇవ్వడంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు