Congress: 5 లక్షలు.. 4 లక్షలు.. 3 లక్షలు..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన చోట కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ సత్తా చాటింది. పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ సాధించింది.

Updated : 05 Jun 2024 06:59 IST

కాంగ్రెస్‌ గెలిచిన చోట బంపర్‌ మెజార్టీలు
అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన చోట మళ్లీ సత్తా చాటిన హస్తం పార్టీ
తెలుగు రాష్ట్రాల్లో నల్గొండలో సరికొత్త రికార్డు
మహబూబాబాద్, ఖమ్మంలోనూ భారీ ఆధిక్యం 
ఈనాడు - హైదరాబాద్‌

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన చోట కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ సత్తా చాటింది. పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ సాధించింది. ఉమ్మడి ఏపీ సహా విభజన తర్వాత సైతం తెలుగు రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ ఎవరికీ రానంతగా 5.59 లక్షల మెజార్టీతో నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌ గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంతకాలం ఈ రికార్డు ఉమ్మడి ఏపీలోని కడప   లోక్‌సభ స్థానంలో జగన్‌(5.4 లక్షల మెజార్టీ) పేరుతో ఉండగా ఇప్పుడు అది చెరిగిపోయింది. నల్గొండ లోక్‌సభ స్థానానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్‌నగర్‌లో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యం రావడం విశేషం.

ఖమ్మంలో 2 లక్షల ఓట్ల పెరుగుదల 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో కాంగ్రెస్‌కు 2.60 లక్షల ఓట్ల ఆధిక్యం రాగా ఇప్పుడు అక్కడే మరో 2.07 లక్షలు పెరిగి మొత్తం 4.67 లక్షల మెజార్టీ సాధించింది. మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం   వహిస్తున్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఇందులోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఉన్న పొంగులేటి భారీ మెజార్టీ రావడానికి కృషి చేశారు. 


గిరిజనుల మనసు దోచి లక్ష ఓట్లు అదనం...

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇన్‌ఛార్జిగా ఉన్న గిరిజన రిజర్వుడు నియోజకవర్గం మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ ఏకంగా 3.49 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. గతంలో ఇక్కడ 2.42 లక్షల ఓట్ల ఆధిక్యం రాగా ఇప్పుడు 1.07 లక్షల ఓట్లు అదనంగా రావడం విశేషం.

  • వరంగల్‌ నియోజకవర్గ స్థానం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు 1.6 లక్షల ఓట్ల ఆధిక్యం రాగా ప్రస్తుతం కడియం కావ్య 2.2 లక్షల మెజార్టీతో గెలుపు తీరం చేరుకున్నారు. అంటే ఇప్పుడు ఆధిక్యం 60 వేలు పెరిగింది.  
  • భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 2.22 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సమన్వయ బాధ్యతలు చేపట్టి తీవ్రంగా కృషిచేయడంతో భారీ ఆధిక్యం వచ్చింది. ఆయన గతంలో ఇక్కడ ఎంపీగా నెగ్గిన అనుభవంతో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించారు. 
  • పెద్దపల్లిలోనూ గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షల ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. 
  • జహీరాబాద్‌లో గట్టిపోటీ ఎదుర్కొని కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 వేల ఓట్ల ఆధిక్యం సాధించింది. అప్పుడు 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓడినా తిరిగి పుంజుకుని ఆరునెలల వ్యవధిలోనే 48 వేల ఓట్ల మెజార్టీతో లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంటే ఇప్పుడు మరో 29 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు.

అసెంబ్లీలో ఓడినచోటా మెరుగైన ఓట్ల శాతం

గత నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54 శాసనసభా స్థానాల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో  అప్పటికన్నా మెరుగైన ఓట్లను సాధించింది. 

  • శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని ఖానాపూర్‌ ఒక్కచోటే కాంగ్రెస్‌ నెగ్గింది. అప్పుడు లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌ 2.57 లక్షల ఓట్లతో 3వ స్థానంలో నిలవగా ఇప్పుడు 4.71 లక్షల ఓట్లు వచ్చాయి. 2.14 లక్షల ఓట్లు ఎక్కువ తెచ్చుకుని మూడు నుంచి రెండోస్థానానికి ఎదిగింది. మంత్రి సీతక్క ఇన్‌ఛార్జిగా విస్తృతంగా పర్యటించారు. 
  • నిజామాబాద్‌ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 4.10 లక్షల ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు అంతకన్నా 70 వేల ఓట్లు అదనంగా తెచ్చుకుని 4.80 లక్షల ఓట్లు సాధించి 2వ స్థానంలోనే నిలిచింది. ఈ స్థానానికి ఎన్నికల ఇన్‌ఛార్జిగా పి.సుదర్శన్‌రెడ్డిని పార్టీ నియమించింది.
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో కలిసి ఉన్న మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో మూడుచోట్లా కాంగ్రెస్‌ ప్రస్తుతం 2వ స్థానంలో నిలిచింది. వీటిలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మొత్తం ఓట్లను పరిశీలిస్తే మూడు లోక్‌సభ స్థానాల్లోనూ అప్పుడూ, ఇప్పుడూ 2వ స్థానంలోనే నిలిచింది. భారాస, భాజపా 1, 3 స్థానాలే అటు, ఇటూ మారాయి. కాంగ్రెస్‌కు గతం కన్నా ఓట్లు పెరిగాయి. 
  • మెదక్‌ పరిధిలో నవంబరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 3.22 లక్షల ఓట్లతో రెండోస్థానం దక్కింది. ఇప్పుడు అవే స్థానాల్లో అంతకన్నా ఎక్కువగా ఓట్లు వచ్చినా 2వ స్థానంలోనే నిలిచింది. మంత్రి కొండా సురేఖ మెదక్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని