Congress: ఓడిన స్థానాల్లో గెలిచి.. గెలిచిన చోట వెనకబడి..

ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన పలు నియోజకవర్గాల్లో.. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ భారీగా ఓట్లు పెంచుకుంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల పరంగా ఇప్పుడు ఆధిక్యం సాధించింది.

Updated : 06 Jun 2024 06:56 IST

‘చే’జారిన అసెంబ్లీ స్థానాల్లో కొన్నింట ఇప్పుడు ఆధిక్యం
సిటింగ్‌ ఎమ్మెల్యేలున్నా.. కొన్నిచోట్ల దక్కని మెజారిటీ
లోక్‌సభ ఎన్నికల్లోనూ 64 సెగ్మెంట్లలోనే కాంగ్రెస్‌ పైచేయి
ఈనాడు, హైదరాబాద్‌

రు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన పలు నియోజకవర్గాల్లో.. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ భారీగా ఓట్లు పెంచుకుంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల పరంగా ఇప్పుడు ఆధిక్యం సాధించింది. లోక్‌సభ సీట్లు గెల్చుకోని చోట కూడా వాటి పరిధిలోని కొన్ని శాసనసభ స్థానాల్లో ఆరు నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్‌కు మెరుగైన ఓట్లు రావడం విశేషం. మరోవైపు 64 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌కు సిటింగ్‌ ఎమ్మెల్యేలున్నా.. 15 నియోజకవర్గాల్లో ఆధిక్యం చేజారింది. మిగిలిన 49 సెగ్మెంట్లకు తోడు.. భారాస గెలిచిన 12 స్థానాలు, భాజపా, ఎంఐఎం, సీపీఐ గెలిచిన ఒక్కో స్థానంలో కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ లభించింది. ఇలా లోక్‌సభ ఎన్నికల్లోనూ మొత్తంగా 64 సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు ఆధిక్యం దక్కింది. 

  • నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. దీని పరిధిలోని నిజామాబాద్‌ అర్బన్, జగిత్యాల నియోజకవర్గాల్లో ఆరు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైనా.. లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో అధికంగా ఓట్లు సాధించి మొదటి స్థానానికి రావడం విశేషం. 

అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌లో కాంగ్రెస్‌ 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా.. లోక్‌సభ ఎన్నికల్లో 15,800 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జగిత్యాలలో 54,421 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అక్కడ గెలిచిన భారాస కంటే కాంగ్రెస్‌కు 16 వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొంత పుంజుకుని 76,145 ఓట్లతో అగ్రస్థానానికి చేరింది. ఇక్కడ భాజపా పొందిన 74,298 ఓట్ల కంటే కాంగ్రెస్‌కు 1847 ఓట్ల ఆధిక్యం లభించింది. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి సొంత నియోజకవర్గం జగిత్యాల కావడంతో గట్టిగా ప్రచారం చేసి ఆధిక్యాన్ని సాధించారు. నిజామాబాద్‌ రూరల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 78 వేల ఓట్లొస్తే ఇప్పుడు 56,674కి పడిపోయింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 12 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గినా.. లోక్‌సభ ఎన్నికల్లో వెనకబడడంతో భాజపాకు ఏకంగా 44,600 ఓట్ల మెజార్టీ లభించింది. రూరల్‌లో కాంగ్రెస్‌ నేతలు చురుగ్గా పనిచేయకపోవడం దెబ్బతీసిందని కాంగ్రెస్‌ వర్గాల అంచనా. బాల్కొండలో కాంగ్రెస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 65,800 కాగా.. లోక్‌సభ ఎన్నికల్లో 53,600కి తగ్గాయి. కోరుట్ల, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌ అర్బన్, జగిత్యాల సెగ్మెంట్లలో కలిపి.. అసెంబ్లీ ఎన్నికలకన్నా కాంగ్రెస్‌ 73 వేల ఓట్లు అధికంగా సాధించినా.. మొత్తం ఓట్లలో భాజపా కంటే వెనుకబడడంతో ఈ లోక్‌సభ సీటు ‘చే’జిక్కలేదు.

మెదక్‌లో రెండుచోట్ల ఆధిక్యం

అసెంబ్లీ ఎన్నికల్లో.. మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ ఇప్పుడు అక్కడే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానానికి చేరింది. మాజీ సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఏకంగా 101 శాతం ఓట్లు పెరిగాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 32,568 ఓట్లతో భారాస, భాజపాల తరువాత మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు 65,539 ఓట్లతో రెండో స్థానానికి చేరింది. మెదక్‌ స్థానంలో అసెంబ్లీ ఎన్నికల్లో 10,125 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ గెలుపొందగా.. ఇప్పుడు భాజపాకన్నా 12 వేల ఓట్లు వెనుకబడి రెండోస్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌లో 87,126 ఓట్లు సాధించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు అక్కడ 55,588 మాత్రమే వచ్చాయి. ఆలస్యంగా ప్రచారం ప్రారంభించడం, అన్ని గ్రామాల్లో తిరగకపోవడం వల్ల మెదక్‌ సెగ్మెంట్‌లో ఏకంగా 31,538 ఓట్లు తగ్గిపోయాయి. 

గిరిజన ప్రాంతాల్లో తారుమారు

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు సీట్లలో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌లో మాత్రమే కాంగ్రెస్‌ 4 వేల ఓట్ల ఆధిక్యంతో నెగ్గింది. అప్పుడు 58 వేల ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ భాజపాకు 75 వేల ఓట్లు రావడంతో కాంగ్రెస్‌ 61 వేల ఓట్లు సాధించినా.. రెండో స్థానానికే పరిమితమైంది. ఆసిఫాబాద్, సిర్పూర్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా కాంగ్రెస్‌ మొదటి స్థానం సాధించింది. సిర్పూరులో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 8,427 ఓట్లతో నాలుగో స్థానంలో నిలవగా.. ఇప్పుడు 62,956 ఓట్లు సాధించి అగ్రస్థానానికి చేరింది. ఆసిఫాబాద్‌లో 60,238 నుంచి 73,996 ఓట్లకు పెరిగి.. మొదటి స్థానంలో నిలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చిచూసినా ఈ రెండు నియోజకవర్గాల్లో మెరుగైన ఓట్లను సాధించింది. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ సొంత గ్రామం సిర్పూరు (యు) మండలంలోని కొల్లార కావడంతో ఏజెన్సీ ప్రాంత గిరిజనులు అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నంగా.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసినట్లు అర్థమవుతోంది. ఈ స్థానానికి కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రి సీతక్క కూడా విస్తృతంగా ప్రచారం చేయడం కలసి వచ్చింది. గిరిజనులు, దళితుల ఓట్లున్న ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ మెరుగైన ఓట్లు సాధించగా.. లోక్‌సభ బరిలో అంతకన్నా మెరుగైన ఫలితాలను సాధించింది. మహబూబాబాద్‌ (ఎస్టీ) లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భద్రాచలం సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ 5,719 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు అదే సెగ్మెంట్‌లో 34,231 ఓట్ల ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచింది. 

రాజధానిలో మూడు చోట్ల..

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మూడు నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నియోజకవర్గాన్ని కోల్పోయినా.. ప్రస్తుత ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో.. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో ఓటమిపాలైనా.. ఎంపీ ఎన్నికల్లో... జూబ్లీహిల్స్, నాంపల్లి సెగ్మెంట్లలో మొదటిస్థానం సాధించింది. జూబ్లీహిల్స్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో 16 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలవగా.. ఇప్పుడు ఆ లోటు పూడ్చుకుని, మరో 25 వేల ఓట్ల ఆధిక్యంతో అగ్రస్థానానికి చేరింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64,212 ఓట్లతో రెండోస్థానం దక్కగా.. ఇప్పుడు 89,705 ఓట్లతో మొదటి స్థానానికి చేరింది. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 60,148 నుంచి 1,03,155 ఓట్లకు చేరి అగ్రస్థానాన్ని సాధించింది. నాంపల్లిలో ఆరు నెలల క్రితం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో.. ఈ సెగ్మెంట్‌లో రెండో స్థానంలో నిలిచిన భాజపా కంటే 62 వేలకు పైగా ఓట్లు అధికంగా సాధించి అగ్రస్థానానికి చేరింది. ఇక హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఇంకా తక్కువ ఓట్లకే పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని