Congress: వర్క్‌.. వెల్త్‌.. వెల్ఫేర్‌.. కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్య నేతలు సోనియా, రాహుల్‌ తదితరులు ‘న్యాయ్‌పత్ర’ పేరుతో దిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు.

Updated : 05 Apr 2024 12:44 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్య నేతలు సోనియా, రాహుల్‌ తదితరులు ‘న్యాయ్‌పత్ర’ పేరుతో దిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై దీనిని రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ చిదంబరం వివరించారు. గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్నిరంగాల్లో విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడారు. ‘‘మా మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నాం. దేశ రాజకీయ చరిత్రలో న్యాయ పత్రాలుగా దీనిని ప్రజలు గుర్తుంచుకుంటారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’లో అందిస్తామన్న ఐదు న్యాయాలు, 25 గ్యారంటీలు దీనిలో ఉన్నాయి. ‘యువ న్యాయ్‌’ కింద ప్రతి విద్యావంతుడికి అప్రంటీస్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తాం. దీని కోసం ఒక్కొక్కరిపై రూ.లక్ష వెచ్చిస్తాం. ‘మహిళా న్యాయ్‌’ కింద పేద ఇంటి ఆడవారికి ఏటా రూ.లక్ష సాయం చేస్తాం. ‘కిసాన్‌ న్యాయ్‌’ కింద రైతులకు రుణమాఫీ, ఎంఎస్‌పీ చట్టాలకు హామీ ఇస్తున్నాం. ‘శ్రామిక్‌ న్యాయ్‌’ కింద ఉపాధి హామీ పథకంలో కనీసం రూ.400 వేతనం ఇస్తాం. ‘హిస్సేదార్‌ న్యాయ్‌’లో సామాజిక, ఆర్థిక సమానతల కోసం జాతీయ జనగణన చేపడతాం. ఇది ఎవరికీ వ్యతిరేకంగా కాదు. కేవలం ప్రజల స్థితిగతులపై అవగాహన కోసమే చేపడుతున్నాం. రాష్ట్రాలకు అందాల్సిన నిధులను ఇస్తాం. ‘రక్షా న్యాయ్‌’ కింద విదేశీ వ్యవహారాల్లో కూడా మార్పులు తీసుకొస్తాం. మేం చేయగలిగిన అంశాలనే మేనిఫెస్టోలో చేర్చాం’’

‘‘మోదీ హయాంలో ఒక్కటైనా పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చారా..? కేవలం తిట్లు తప్పితే ఆయన పాలనలో మరేమీ వినలేదు. విపక్ష నేతలను జైళ్లలో పెడుతున్నారు. ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలేదు. మా పార్టీపై రూ.3,500 కోట్ల జరిమానాలు విధించారు. నేడు మాపై జరిగినవి.. రేపు మీడియాపై జరగవచ్చు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడి మోదీని గద్దె దించాలి. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్టీ హామీలును వారి వద్దకు చేర్చాలి. అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని భాజపా మమ్మల్ని నిందిస్తోంది. ప్రధాని ఇప్పటి వరకు భయపడి మణిపుర్‌ వెళ్లలేదు.. మా నేత రాహుల్‌ అక్కడికి వెళ్లారు. భయపడే నేత దేశానికి మంచి చేయలేరు’’ అని ఖర్గే పేర్కొన్నారు.  

23 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెస్తాం: చిదంబరం

వర్కింగ్‌ కమిటీలో పూర్తిస్థాయిలో చర్చించి మేనిఫెస్టోను తయారు చేసినట్లు పార్టీ నేత, దీని కమిటీ ఛైర్మన్‌ పి.చిదంబరం తెలిపారు. గత పదేళ్లలో అన్ని రకాల న్యాయాలు ప్రజలకు అందలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను పనిచేయనీయకపోవడం, బలహీన వర్గాల అణచివేత కొనసాగుతోందన్నారు. పార్లమెంట్‌ వ్యవస్థను కూడా బలహీనపర్చారని ఆరోపించారు. గత పదేళ్లలో దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చేలా మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలిపారు. ‘వర్క్‌, వెల్త్‌, వెల్ఫేర్‌’(ఉద్యోగాలు, సంపద, సంక్షేమం)ను ప్రజలకు అందిస్తామన్నారు. యూపీఏ తొలి విడత పాలనలో 8.5 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. గత పదేళ్లలో దేశం 5.9 శాతం మాత్రమే వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం 24 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చిందని.. 2024లో అధికారం చేపట్టాక మరో 23 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని చిదంబరం పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌ పూర్తి మేనిఫెస్టో కోసం క్లిక్‌ చేయండి

మరికొన్ని కీలక హామీలు..

  • అగ్నిపథ్‌ పథకం రద్దు
  • జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా
  • రైట్‌ టూ అప్రంటీస్‌ చట్టం 
  • మహాలక్ష్మి పథకం కింద పేద మహిళకు ఏటా రూ.లక్ష సాయం
  • ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు
  • మార్చి 15 నాటికి ఉన్న విద్యా రుణాల మొత్తం రద్దు చేస్తాం. ఆ సొమ్మును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది
  • మైనార్టీలకు వస్త్రధారణ, ఆహారం, భాష, పర్సనల్‌ లాను ఎంచుకొనే హక్కు ఇస్తాం
  • తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్‌ కౌన్సిల్‌ ఇండియా చట్టాన్ని సవరిస్తాం
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు