Lok Sabha Elections: కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఏప్రిల్‌ 5న.. ఆ మరుసటి రోజే హైదరాబాద్‌లో మెగా ర్యాలీ!

ఎన్డీయే సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కృషిచేస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

Published : 01 Apr 2024 22:32 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో సిద్ధమైంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో విస్తృత చర్చల ద్వారా రూపొందించిన మేనిఫెస్టోను ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు.  ఆ మరుసటి రోజు ఏప్రిల్‌ 6న రాజస్థాన్‌లోని జైపుర్‌, తెలంగాణలోని హైదరాబాద్‌ నగరాల్లో  మెగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు  ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. జైపుర్‌లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే, హైదరాబాద్‌ మెగా ర్యాలీలో రాహుల్‌ మేనిఫెస్టోను లాంచ్‌ చేసి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.  దేశానికి సంక్షేమం అందించడం, అభివృద్ధి అనుకూల విజన్‌తోనే కాంగ్రెస్‌ ఎప్పుడూ పనిచేస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ‘పాంచ్‌ న్యాయ్‌ ’ పేరిట తమ హామీలను పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.  మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతోపాటు, 25 గ్యారంటీలను ప్రకటించింది. ‘న్యాయ్‌ పిల్లర్ల’ పేరుతో 25 గ్యారంటీలను ఐదు భాగాలుగా విభజించింది. ‘పీపుల్స్‌ మేనిఫెస్టో’ పేరుతో దీని రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని