BJP: తగ్గింది 0.7 శాతమే అయినా.. 63 సీట్లకు గండి

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 36.6 శాతం ఓట్లు సాధించింది. 2019లో వచ్చిన 37.3 శాతంతో పోలిస్తే తగ్గింది 0.7 శాతమే. కానీ సీట్లపరంగా భారీగా గండి పడింది. ఏకంగా 303 నుంచి 240కి పడిపోయింది.

Updated : 06 Jun 2024 04:36 IST

భారీగా నష్టపోయిన భాజపా 
1.7 శాతం పెంచుకుని లాభపడ్డ కాంగ్రెస్‌

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 36.6 శాతం ఓట్లు సాధించింది. 2019లో వచ్చిన 37.3 శాతంతో పోలిస్తే తగ్గింది 0.7 శాతమే. కానీ సీట్లపరంగా భారీగా గండి పడింది. ఏకంగా 303 నుంచి 240కి పడిపోయింది. 63 స్థానాలు తగ్గాయి. మరోవైపు కాంగ్రెస్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. గత ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 21.2 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. అంటే 1.7 శాతం ఓట్లు పెరిగాయి. కానీ సీట్లు దాదాపు రెండింతలై 52 నుంచి 99కి ఎగబాకాయి. 2019లో కంటే ఈసారి ఎక్కువ సీట్లలో భాజపా పోటీ చేసింది. కానీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. 2019లో 2.55 శాతం ఓట్లను సాధించిన సమాజ్‌ వాదీ పార్టీ ఈసారి 4.59 శాతం ఓట్లను సాధించింది.

ఓట్లు పెరిగినా సీట్లు దక్కలేదు

తమిళనాడులో భాజపా ఓట్ల శాతం 2019తో పోలిస్తే 3.2 శాతం నుంచి 11.2 శాతానికి పెరిగింది. కానీ పెరిగిన ఆ ఓట్లు ఒక్క సీటునూ గెలిపించలేకపోయాయి. పంజాబ్‌లో ఓట్ల శాతం 9.6 శాతం నుంచి 18.6 శాతానికి పెరిగింది. ఏ పార్టీతో పొత్తు లేకపోవడంతో ఉన్న రెండు సీట్లనూ చేజార్చుకోవాల్సి వచ్చింది. 

ఓట్లు, సీట్లు తగ్గి..

బిహార్‌లో 23.6 శాతం నుంచి 20.5 శాతానికి కుంగడం భాజపాకు 5 సీట్లకు గండికొట్టింది. పశ్చిమ బెంగాల్‌లో 1.6 శాతం ఓట్లు తగ్గగా.. 6 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలోనైతే తగ్గింది 1.4 శాతం ఓట్లే అయినా సీట్ల సంఖ్య 23 నుంచి 10కి పడిపోయింది.


పెరిగిన సీట్లు

కాంగ్రెస్‌ మహారాష్ట్రలో 16.3 శాతం నుంచి 17.1 శాతంకు ఓట్లను పెంచుకుని సీట్ల సంఖ్యను ఏకంగా ఒకటి నుంచి 13కు చేర్చింది. రాజస్థాన్‌లో 3.7 శాతం ఓట్ల వ్యత్యాసంతో ఏకంగా సున్నా నుంచి 8 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. యూపీలో 6.3 శాతం నుంచి 9.5 శాతానికి ఓట్లు పెరగ్గా.. సీట్లు ఒకటి నుంచి 6కు ఎగబాకాయి. ఆ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల శాతం 18 నుంచి 33.5 శాతానికి పెరిగింది. దీంతో పార్టీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 37 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ఆ రాష్ట్రంలో ఇండియా కూటమి సాధించిన 43 శాతం ఓట్లు దాదాపు ఎన్డీయేకు సమానం కావడం గమనార్హం.

40 ఏళ్ల తర్వాత హస్తం పార్టీకి 13 కోట్లకుపైగా ఓట్లు

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక రికార్టు సాధించింది. 1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ 13 కోట్లకుపైగా ఓట్లను సాధించింది. 40 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ ఈ స్థాయిలో ఓట్లను పొందింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం భారీగా ఓట్లు సాధించిన హస్తం పార్టీ ఆ తర్వాత అంతగా రాణించలేకపోయింది. మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటింది.

ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 64.20 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో కాంగ్రెస్‌ 13.63 కోట్లకుపైగా ఓట్లను సాధించింది. భాజపా 23.45 కోట్ల ఓట్లను పొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని