Congress: కాంగ్రెస్‌ vs కాంగ్రెస్‌.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు

కాంగ్రెస్‌ కంచుకోట కోలార్‌లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్‌ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది.

Updated : 28 Mar 2024 18:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌కు (Congress) పెట్టని కోట అది. మిన్ను విరిగి మీదపడుతున్నా.. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ఆశలు చూపినా అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థే విజేత. 2019 ఎన్నికల్లో మినహా 1952 నుంచి ఇక్కడ కాంగ్రెస్‌కు ఎదురు లేదు. కానీ, తాజా ఎన్నికల్లో ఆ స్థానం అంతర్గత పోరుకు వేదికైంది. అక్కడి అభ్యర్థిని ఎంపిక చేయడం పార్టీ హైకమాండ్‌కు కత్తిమీద సాములా తయారైంది. అదే.. కర్ణాటకలోని కోలార్‌ (Kolar Lok Sabha Constituency) లోక్‌సభ నియోజకవర్గం. అసమ్మతి నేతల ధిక్కార స్వరంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. హైమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

మేనల్లుడి కోసం పోరాటం

కోలార్‌ లోక్‌సభ స్థానం ఎస్సీ కేటగిరీకి చెందినది. 1952 నుంచి ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిదే విజయం. 1991 నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కేహెచ్‌ మునియప్ప ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం సిద్ధరామయ్య సర్కారులో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. తన మేనల్లుడు చిక్క పెద్దన్నకు ఈ టికెట్‌ ఇప్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిపై పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. అదే జరిగితే పార్టీకి రాజీనామా చేస్తామని సీనియర్‌ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. 

అదే జరిగితే రాజీనామాలే!

కోలార్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్సీలు పెద్దన్నకు టికెట్‌ అంశాన్ని తప్పుబడుతున్నారు. అధిష్ఠానం నుంచి వ్యతిరేక నిర్ణయం వస్తే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యనేతలకు సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా కౌన్సిల్‌ ఛైర్మన్‌, అసెంబ్లీ స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ పెద్దన్నకు టికెట్‌ కేటాయిస్తే కోలార్‌లో ఎస్సీ ఓటర్లు రెండు వర్గాలుగా చీలిపోతారని, ఫలితంగా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీనియర్‌ నేతలు పార్టీ హైకమాండ్‌కు సంకేతాలు పంపారు. పెద్దన్నకు టికెట్‌ను వ్యతిరేకించిన వారిలో.. జి. మంజునాథ్‌ (కోలార్‌ అసెంబ్లీ నియోజకవర్గం), కేవై నంజెగౌడ (మలూర్‌ అసెంబ్లీ), ఎంసీ సుధాకర్‌ (చింతామణి అసెంబ్లీ), ఎమ్మెల్సీలు అనిల్‌ కుమార్‌, నజీర్‌ అహ్మద్‌ ఉన్నారు. వీరిలో సుధాకర్‌ ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు వ్యతిరేక స్వరం వినిపిస్తూనే.. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నేతలు ప్రకటించడం గమనార్హం.

‘‘ పార్టీ హైకమాండ్‌పై ఎంతో గౌరవం ఉంది. వారసత్వంగా కాకుండా పార్టీలో కష్టపడిన వారికే అవకాశం ఇవ్వాలన్నది మా ఆలోచన. ఇదే ఇక్కడి సమస్య. కొందరు పార్టీ పెద్దలపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి, టికెట్‌ దక్కించుకోవాలనుకుంటున్నారు. దీనికి మేం వ్యతిరేకం. ఒకవేళ అదే జరిగితే.. మేం ప్రజాప్రతినిధులుగా కొనసాగకుండా.. ఇంట్లోనే కూర్చుంటాం’’ అని మంత్రి సుధాకర్‌ మీడియాకు వెల్లడించారు. అసమ్మతి నేతలంతా రాజీనామాలకు సిద్ధమవ్వడంతో సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వాళ్లకు ఫోన్‌ చేసి మాట్లాడారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని వారించారు. ఈ సమస్య పరిష్కార బాధ్యతను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బీఎస్‌ సురేశ్‌కు అప్పగించారు. 

అక్కడ గెలవాలంటే మేమే ఉండాలి!

కోలార్‌ స్థానంలో పూర్వవైభవం సాధించాలంటే తమ కుటుంబానికి చెందిన వ్యక్తే బరిలో ఉండాలని మునియప్ప అంటున్నారు.కానీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. ‘‘ ఎన్నికల ముందు ఇలాంటి చిన్న అవరోధాలు సహజమే. కాకపోతే, దురదృష్టం కొద్దీ ఇవి తారస్థాయికి చేరాయి. మేమంతా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను కలిశాం. పరిస్థితి వివరించాం. నియోజకవర్గ ప్రజల పూర్తి మద్దతు ఉందని చెప్పా. కేవలం ఒకే ఒక్కసారి, అదికూడా గత ఎన్నికల్లోనే ఓటమి ఎదురైందన్న సంగతి వాళ్లకు కూడా తెలుసు. అసమ్మతి నేతలు కూడా కొన్ని పేర్లు ప్రస్తావించారు. అందరం కలిసి నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే విడిచిపెట్టాం. ఆ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం’’ అని మునియప్ప మీడియాకు వివరించారు. అయితే, అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఎన్డీయే కూటమి నుంచి ఎవరో?

మరోవైపు ఈ స్థానంపై ఎన్డీయే కూటమిలోనూ స్తబ్ధత నెలకొంది. కోలార్‌ నియోజకర్గం నుంచి భాజపా బరిలోకి దిగుతుందా? మిత్రపక్షం జేడీఎస్‌కు కేటాయిస్తుందా? అన్నదానిపై స్పష్టత లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 28 స్థానాలకు గానూ 27 స్థానాల్లో బరిలోకి దిగిన భాజపా 25 చోట్ల విజయం సాధించింది. అందులో కోలార్‌ కూడా ఒకటి. భాజపా మద్దతుతో మండ్య నుంచి సుమలత గెలుపొందారు. దీంతో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు ఎన్డీయే కూటమి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇక్కడ పార్టీ జెండాను రెపరెపలాడించాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది. ఈ స్థానానికి రెండో విడతగా ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని