కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్‌

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు.

Published : 18 May 2024 04:11 IST

అస్థిరతను సృష్టించేందుకే ఎన్నికల బరిలో ‘ఇండియా’
ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు

బారాబంకీ, హమీర్‌పుర్, ఫతేహ్‌పుర్‌: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. ఎన్నికలు జరిగే కొద్దీ ఆ కూటమి పేకముక్కల్లా కూలిపోతోందంటూ ఎద్దేవా చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో శుక్రవారం నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. ‘‘శ్రీరామనవమి రోజున ఎస్పీకి చెందిన ఓ సీనియర్‌ నేత (రామ్‌గోపాల్‌ యాదవ్‌ను ఉద్దేశించి..) రామమందిరంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును మార్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే ప్రథమ ప్రాధాన్యం. ఒకవేళ ఎస్పీ-కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. అవి బుల్డోజర్‌ను పంపి రామమందిరాన్ని కూల్చివేస్తాయి. రామ్‌లల్లాను మళ్లీ టెంట్‌ కిందకి తీసుకొస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలన్నదానిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వద్ద ఎస్పీ, కాంగ్రెస్‌ ట్యూషన్‌ చెప్పించుకోవాలంటూ మోదీ చురకలంటించారు.

పగటి కలలు కంటున్నారు 

ప్రధాని పదవిపై విపక్ష నేతలు పగటి కలలు కంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు. రాయ్‌బరేలీ ప్రజలు ఈ దఫా కేవలం ఎంపీనే కాకుండా ప్రధానమంత్రిని ఎన్నుకోబోతున్నారంటూ ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘెల్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్‌ ఈసారి అమేఠీలో పోటీ చేసే సాహసం చేయరని తాను ముందే ఊహించానని, అదే నిజమైందని పేర్కొన్నారు. 

పాక్‌కు అణ్వస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు

పాకిస్థాన్‌ వద్ద అణ్వస్త్రాలున్నాయని చెబుతున్న కాంగ్రెస్‌.. వాటి నిర్వహణకు ఆ దేశం వద్ద డబ్బుల్లేవన్న విషయాన్ని గుర్తించలేకపోయిందని మోదీ విమర్శించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పరువు కాపాడుకునేందుకు కేవలం 50 సీట్లు గెలవడాన్ని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. హమీర్‌పుర్, ఫతేహ్‌పుర్‌లలో నిర్వహించిన ప్రచార సభల్లో ఈ మేరకు మోదీ ప్రసంగించారు.  

కాంగ్రెస్‌ది మావోయిస్టు మ్యానిఫెస్టో 

సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోను ‘మావోయిస్టు మ్యానిఫెస్టో’గా ప్రధాని మోదీ విమర్శించారు. అది అమలైతే ఆర్థిక వృద్ధికి బ్రేకులు పడతాయని, దేశం దివాలా తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే దేవాలయాల బంగారాన్ని, మహిళల మంగళసూత్రాలను లాగేసుకుంటుందని ఆరోపించారు. ముంబయిలోని శివాజీ పార్కు వద్ద శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడారు.


ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు పంచుతాం! 

దిల్లీ: దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోదీ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో  ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే అది సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు. అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకుంటున్న నోట్ల గుట్టలకు సంబంధించి ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సొమ్మును పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వాల హయాంలో కొందరు తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా తిరిగి పేదలకే చెందాలని కోరుకుంటున్నా. ఇందుకోసం న్యాయ బృందం సలహా కోరుతాం. చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోం’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని