CPI: భారాస షాక్‌.. మగ్దూం భవన్‌లో సీపీఐ అత్యవసర సమావేశం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం ఇవాళ అత్యవసర సమావేశమైంది. మగ్దూం భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి.. చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, బాల మల్లేష్, పద్మ, తక్కలపల్లి శ్రీనివాస్‌రావు హాజరయ్యారు.

Updated : 22 Aug 2023 15:52 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం ఇవాళ అత్యవసర సమావేశమైంది. మగ్దూం భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి.. చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, బాల మల్లేష్, పద్మ, తక్కలపల్లి శ్రీనివాస్‌రావు హాజరయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు భారాస దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన దృష్ట్యా భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంతో కలిసి పోటీ చేస్తామని అన్నారు. పొత్తుల కోసం మేమెప్పుడూ వెంపర్లాడలేదని చెప్పారు. కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ అడిగిన మాట వాస్తవమేనని అయితే, కేసీఆర్‌ తన అవసరం కోసమే తమ మద్దతు కోరారని అన్నారు. ప్రజాతంత్ర పార్టీలతో కలిసి ఎన్నికలకు సిద్ధం అవుతామని వెల్లడించారు. ఎన్ని సీట్లలో పోటీ చేయాలో త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. 

ఉమ్మడి కార్యాచరణ

మరోవైపు, మధ్యాహ్నం 3 గంటలకు సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ, సీపీఎం సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తారని ఇరు పార్టీల వర్గాలు తెలిపాయి. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు భారాసకు మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి కృషి చేశాయి. అప్పటి నుంచి భారాస, వామపక్షాల మధ్య మైత్రి ప్రారంభమైంది. కానీ కేసీఆర్‌ భారాస అభ్యర్థుల జాబితాను ప్రకటించేయడంతో వామపక్షాలు కంగుతిన్నాయి.

ఫలించని చర్చలు

సీట్ల సర్దుబాటుపై కొద్దిరోజుల క్రితం భారాస, వామపక్ష నేతల మధ్య చర్చలు జరిగాయి. సీపీఎం, సీపీఐలకు ఒక్కో ఎమ్మెల్యే స్థానం, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని భారాస ప్రతిపాదించింది. చెరి 3 అసెంబ్లీ స్థానాలకు పట్టుబట్టిన వామపక్షాలు.. కనీసం రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలైనా ఇవ్వాలని అడిగాయి. లేదంటే ఎమ్మెల్సీ సీట్లకు బదులు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ కోరింది. సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు ఇస్తామని భారాస ప్రతిపాదించింది. వీటికి అదనంగా పాలేరు, మిర్యాలగూడెంలో ఏదో ఒకటి ఇవ్వాలని సీపీఎం.. కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్‌లో 1 ఇవ్వాలని సీపీఐ కోరాయి. కానీ ఒక్కో అసెంబ్లీ స్థానం, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే ఇస్తామని భారాస పేర్కొనడంతో చర్చలు ఫలించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని