ఏ నిందితుడూ ఇన్నేళ్లు బెయిల్‌పై బయట ఉండలేదు: సీఎం జగన్‌ను ఉద్దేశించి నారాయణ వ్యాఖ్య

తెలుగు రాష్ట్రాల్లో వైకాపా, భారాస ముసుగులో భాజపా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమే కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

Updated : 27 Aug 2023 16:07 IST

గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో వైకాపా, భారాస ముసుగులో భాజపా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమే కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సీపీఐ బస్సు యాత్ర గుంటూరుకు చేరుకోవడంతో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీనియర్‌ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం జగన్‌.. కేసులకు భయపడి ప్రధాని మోదీకి లొంగిపోయారని ఆరోపించారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌.. బెయిల్‌పై బయట ఉన్నారని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ నిందితుడూ ఇన్నేళ్లు బెయిల్‌పై బయట ఉండలేదని నారాయణ వ్యాఖ్యానించారు. 

రామకృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు గడిచినా నేటికీ ఆ కేసు తేలలేదన్నారు. పులివెందులకు వెళ్లి చిన్న పిల్లాడిని అడిగినా వివేకాను హత్య చేసింది ఎవరనే విషయం చెబుతారన్నారు. సీబీఐ మాత్రం ఇంకా విచారణ కొనసాగిస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని