CPI Ramakrishna: జగన్‌కు సుప్రీంకోర్టు అన్నా లెక్క లేకుండా పోయింది: సీపీఐ రామకృష్ణ

సీఎం జగన్‌కు ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రమే కాదు.. చివరకు సుప్రీంకోర్టు అన్నా లెక్క లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 12 Oct 2023 15:30 IST

అనంతపురం: సీఎం జగన్‌కు ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రమే కాదు.. చివరకు సుప్రీంకోర్టు అన్నా లెక్క లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టులో ఉండగానే.. ఆయన పరిపాలన రాజధానిని విశాఖకు తరలించడం ఏంటని ప్రశ్నింటారు. చట్టాన్ని అమలు చేయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇలా దొడ్డి దారిన వెళ్తున్నారన్నారు. వెనుకబడిన ప్రాంతాల కోసం అని చెబుతున్న జగన్.. కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం రాయలసీమ నాలుగు జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలే కదా?అని ప్రశ్నించారు. మరి ఇక్కడి నుంచి ఎందుకు పాలన చేయడం లేదని నిలదీశారు.

మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నెల రోజులవుతున్నా ఒక్క ఆధారం కూడా చూపలేదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా పేపర్ల మీద ఉండగానే.. కేసులు పెడుతున్నారన్నారు. తెలంగాణ ఎన్నికలు ఉన్నాయనే కృష్ణా జలాల విషయంలో కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. అనంతపురంలో ప్రభుత్వాన్ని వైకాపా కార్పొరేటర్లే నిలదీస్తుంటే.. ఇంకెక్కడ 175 సీట్లని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రశాంతత రావాలంటే సీఎం జగన్ పాలన పోవాలని.. దీని కోసం అంతా ఐక్యం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని