Encroach Assigned Lands: ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కు సీఎస్‌ ఒత్తిడి

నెలరోజుల్లో పదవీవిరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి.. రూ.వేల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Updated : 26 May 2024 06:39 IST

విశాఖ పరిధిలో జవహర్‌రెడ్డి భూ కుంభకోణాలపై ఈసీ జోక్యం చేసుకోవాలి
జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌

మాట్లాడుతున్న జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌

ఈనాడు-విశాఖపట్నం, సీతంపేట, న్యూస్‌టుడే: నెలరోజుల్లో పదవీవిరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి.. రూ.వేల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. ఇప్పటికే ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన 400 ఎకరాల ఎసైన్డ్‌ భూములను తన కుమారుడ్ని అడ్డం పెట్టి బినామీల పేరిట చేజిక్కించుకున్నారని పేర్కొన్నారు. మరో 400 ఎకరాలను రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. విశాఖలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల కోడ్‌ వచ్చాక విశాఖ పరిధిలో జరిగిన ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లను రద్దుచేసి, జవహర్‌రెడ్డి భూ అక్రమాలపై ఈసీ జోక్యం చేసుకోవాలి. నాలుగు రోజుల కిందట భోగాపురం విమానాశ్రయ పనుల సమీక్ష పేరుతో వచ్చిన సీఎస్‌.. అక్కడి ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఒత్తిడి చేశారు. పోలింగ్‌ అనంతర హింసపై రాష్ట్రంలో విచారణ జరుగుతుంటే, అవేవీ తనకు పట్టనట్లు విశాఖ వచ్చి ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల పరిశీలన పేరుతో జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష చేశారు’ అని మూర్తియాదవ్‌ ఆరోపణలు గుప్పించారు.


సీఎస్‌ కదలికలపై నిఘా పెట్టాలి
తెదేపా నేత వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్, అమరావతి: విశాఖలో దళితులకు చెందిన 800 ఎకరాల ఎసైన్డ్‌ భూములను తన కుమారుడికి దోచిపెట్టేందుకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి పాస్‌పోర్టును సీజ్‌ చేసి.. ఆయన కదలికలపై నిఘాపెట్టాలని శనివారం ఓ ప్రకటనలో ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటినుంచి భూ వ్యవహారాలు సహా ఆయన ఏ కీలక దస్త్రమూ చూడకుండా, విశాఖ అధికారుల్ని కలవకుండా సీఎస్‌ను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ కేంద్రంగా ఆయన సాగిస్తున్న భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ ఐదేళ్లలో ఉత్తరాంధ్రలోని 60% భూములు కడప వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయని వర్ల రామయ్య ఆరోపించారు. రాయలసీమ వాళ్లకు ఇక్కడేం పనని మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఒక సందర్భంలో ప్రశ్నించారని గుర్తుచేశారు. ‘‘సీఎం జగన్‌ కుటుంబం దళితులకు చెందిన వేల ఎకరాల భూములను దోచుకుంది. చంద్రబాబు సీఎం కాగానే జవహర్‌రెడ్డి వంటి భూ దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారు దోచుకున్న భూముల్ని పేదలకు పంచుతాం. ఈ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో జరిగిన భూ క్రయ, విక్రమాలపై కమిషన్‌ వేసి విచారణ జరిపిస్తాం’’ అని వర్ల రామయ్య స్పష్టం చేశారు. 


మూర్తియాదవ్‌ ఆరోపణల్లో నిజం లేదు: సీఎస్‌ జవహర్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో తాను, తన కుటుంబసభ్యులు, బంధువులు ఎలాంటి ఎసైన్డ్‌ భూములూ కొనలేదని సీఎస్‌ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ నిరాధారమైన ఆరోపణలు చేశారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఏప్రిల్‌లో నా స్నేహితుడి కుమార్తె వివాహానికి ఎన్నికల కారణంగా హాజరు కాలేకపోయాను. రెండు రోజుల విశాఖ పర్యటనలో ఆదివారం వెళ్లి ఆ దంపతులను ఆశీర్వదించాను. సోమవారం భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించాను. ఉత్తరాంధ్రలో రూ.2వేల కోట్ల విలువైన 800 ఎకరాల ఎసైన్డ్‌ భూములు కొట్టేసినట్లు మూర్తియాదవ్‌ నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఎసైన్డ్‌ భూముల చట్టసవరణకు అసెంబ్లీ 2023 అక్టోబరులో ఆమోదం తెలిపింది. దీన్ని అనుసరించి ఎసైన్డ్‌ భూములపై జీఓ 596ను రెవెన్యూశాఖ జారీచేసింది. ఉత్తరాంధ్రలో రూ.1,000 కోట్ల విలువైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఎసైన్డ్‌ భూములను నా కుమారుడ్ని అడ్డంపెట్టి బినామీల పేరుతో చేజిక్కించుకున్నట్లు ఆయన చేసిన ఆరోపణల్లో నిజం లేదు. నా కుమారుడు గత ఐదేళ్లలో విశాఖకే కాదు.. ఉత్తరాంధ్రలో ఏ జిల్లాకూ వెళ్లలేదు. భూముల రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ఆఘమేఘాలపై యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి వారిపై ఒత్తిడి తెచ్చినట్లు కార్పొరేటర్‌ నిరాధారమైన ఆరోపణలు చేశారు. విమానాశ్రయం పనుల పరిశీలన పేరు చెప్పి జగన్‌ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సమీక్షించానని చేసిన ఆరోపణలు అవాస్తవం. తప్పుడు ఆరోపణలు చేసిన మూర్తియాదవ్‌ వాటిని వెనక్కి తీసుకుని మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే వ్యక్తిగతంగా పరువునష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం’ అని జవహర్‌రెడ్డి హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని