YSRCP: కొంపలో కుంపట్లు దహించేశాయి!

‘కొంప’లో కుంపట్లు కొందరు వైకాపా అభ్యర్థులను దహించేశాయి. ‘‘మా అన్నను, మా నాన్నను, మా మామను, నా భర్తను నమ్మొద్దు’’ అంటూ ఆయా అభ్యర్థుల కుటుంబ సభ్యులు చేసిన ప్రచారం ఫలించింది.

Updated : 05 Jun 2024 12:57 IST

సొంత కుటుంబ సభ్యుల్నే వంచించిన వైకాపా అభ్యర్థులకు ఓటమి 

ఈనాడు, అమరావతి: ‘కొంప’లో కుంపట్లు కొందరు వైకాపా అభ్యర్థులను దహించేశాయి. ‘‘మా అన్నను, మా నాన్నను, మా మామను, నా భర్తను నమ్మొద్దు’’ అంటూ ఆయా అభ్యర్థుల కుటుంబ సభ్యులు చేసిన ప్రచారం ఫలించింది. ‘‘సొంత కుటుంబ సభ్యుల్నే వంచించిన వారికి ప్రజలో లెక్కా...!’’ అంటూ వారు జనంలోకి వెళ్లడం తీవ్ర ప్రభావం చూపించింది. తమ వారిని ఓడించి శపథం నెరవేర్చుకున్నారు. పంతాన్ని సాధించుకున్నారు. ఒకప్పుడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లోనూ కొద్దిపాటి ఆధిక్యంతో బయటపడాల్సిన పరిస్థితులు కల్పించారు. 

అంబటి రాంబాబుకు ఓటేయొద్దంటూ అల్లుడి ప్రచారం

‘‘అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, శవాల మీద పేలాలు ఏరుకునే దరిద్రుడిని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దేవుడికి రోజూ పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంత నీచుడిని నా జీవితంలో ఇంకెప్పుడూ రానివ్వకు స్వామీ..! అని కోరుకుంటున్నా. ఆయన అంతటి భయంకరమైన వ్యక్తి  ఆయన ఇప్పుడు ఏపదవికైతే పోటీ చేస్తున్నారో... దానికి మంచితనం, మానవతా విలువలు, కనీస సమాజిక బాధ్యత ఎంత ఉండాలో వీటిలో 0.0001% కూడా లేని వ్యక్తి అంబటి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే... పెద్ద గొంతేసుకుని నిస్సిగ్గుగా ఎంత పెద్ద అబద్ధాన్నయినా నిజం చేయవచ్చని, ఎంత లేకి పనిచేసినా సమాజంలో చాలా హూందాగా బతకొచ్చు అని అనుకునే వారికి ఓటేసినట్లే. ఏదైనా చేయవచ్చనే సిగ్గులేనితనాన్ని ప్రోత్సహించవచ్చనుకునే వారికి ఓటేసినట్లే. ఓటర్లు గమనించి సరైన నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సత్తెనపల్లి నుంచి వైకాపా తరఫున పోటీ చేసిన అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్‌ గౌతం ఎన్నికలకు ముందు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో రాంబాబు ఓడిపోయారు. 

తండ్రి మోసం చేశారని రోడ్డెక్కిన కొడుకు! 

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తనను మోసం చేశారంటూ వీధికెక్కిన ఆయన కుమారుడు రవికుమార్‌... తండ్రిని ఓడిస్తానని శపథం చేశారు. తన తల్లి, అక్కనూ పట్టించుకోలేదంటూ ముత్యాలనాయుడుపై ఆయన మండిపడ్డారు. మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గంలో సొంతంగా ప్రచారం చేసుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ... తనకు అండగా నిలవాలంటూ జనాన్ని కోరారు. ఆయన పంతం నెరవేరింది. మాడుగుల నుంచి పోటీ చేసిన ముత్యాలనాయుడు రెండో భార్య కుమార్తె అనూరాధ, అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీ చేసిన ముత్యాలనాయుడు ఇద్దరూ ఓటమి పాలయ్యారు. 

అయినోళ్లనే మోసం చేసిన మనిషంటూ... 

టెక్కలిలో వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు ఆయన భార్య దువ్వాడ వాణి పూర్తిగా సహకరించలేదు. ఆమె తొలుత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవ్వగా... వైకాపా నాయకులు నచ్చజెప్పి విరమింపజేశారు. శ్రీనివాస్‌ను నమ్మొద్దని, సొంత కుటుంబాన్నే మోసం చేసిన వ్యక్తని కుటుంబ సభ్యులే అంతర్గతంగా ప్రచారం చేశారు. ఇక దువ్వాడ వాణి... పెదనాన్న కుమారుడు తెదేపాలో చేరారు. 

జగన్, అవినాష్‌లపై సోదరీమణుల దండయాత్ర

వివేకా హత్య కేసు సహా ప్రతి విషయంలోనూ జగన్‌ మోసం చేశారంటూ సొంత చెల్లెలు వై.ఎస్‌.షర్మిల, మరో చెల్లి సునీత, పిన్ని సౌభాగ్యమ్మలు జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఎండగట్టారు. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక జగన్‌ ఉక్కిరిబిక్కిరయ్యారు. వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని జగన్‌ కాపాడుతున్నారంటూ ప్రచారం చేశారు. ‘‘హంతకులు పాలకులుగా ఉండరాదు... జగనన్నకు ఓటేయొద్దు.’’ అంటూ పిలుపునిచ్చారు. షర్మిల కడప లోక్‌సభ నుంచి అవినాష్‌పై పోటీ చేశారు. ఈ ప్రభావంతో పులివెందులలో జగన్‌కు, కడప లోక్‌సభ స్థానంలో అవినాష్‌కు మెజారిటీ బాగా తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని