MCD Election Results: దిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంలో ఆప్‌

దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో భాజపా, ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

Updated : 07 Dec 2022 11:37 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో మున్సిపల్‌ ఎన్నికల (MCD Elections) ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశాలు కన్పించట్లేదు. ఆధిక్యం, విజయాల్లో భాజపా (BJP), ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. భాజపా 25 వార్డుల్లో విజయం సాధించగా.. మరో 79 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక, ఆమ్‌ ఆద్మీ పార్టీ 21 వార్డుల్లో గెలిచి.. మరో 109 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌ (Congress) పూర్తిగా చతికిలపడింది. కేవలం 3 వార్డుల్లో విజయం సాధించి మరో 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 250 వార్డులుండగా.. మెజార్టీకి 126 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఆమ్‌ ఆద్మీ పార్టీ.. భాజపా కంటే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత పూర్తి ఫలితాలు వచ్చే అవకాశముంది.

దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ MCD)లోని 250 వార్డులకు డిసెంబరు 4న పోలింగ్‌ జరిగింది. మొత్తం 1349 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. మే 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2017 మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా 181 స్థానాల్లో గెలుపొందింది. ఆప్‌ 48, కాంగ్రెస్‌ 27 వార్డుల్ని కైవసం చేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని