Karnataka Elections: అలా చేస్తే.. కమలానికి 20-25 సీట్లు గల్లంతే: మాజీ సీఎం వార్నింగ్‌

Karnataka elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు భాజపా ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో అసమ్మతిని రాజేసింది. టికెట్‌ దక్కని నేతలు ఇతర పార్టీలకు వలస వెళ్తున్నారు. అటు మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌ అభ్యర్థిత్వంపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Published : 15 Apr 2023 15:22 IST

హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly elections) దగ్గరపడుతున్న వేళ.. భాజపా (BJP)లో టికెట్ల రగడ నానాటికీ ముదురుతోంది. అటు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ (Jagadish Shettar) అభ్యర్థిత్వంపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో అసమ్మతిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో శెట్టర్‌.. మరోసారి భాజపా హైకమాండ్‌కు హెచ్చరికలు చేశారు. తనకు టికెట్‌ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ కనీసం 20-25 సీట్లను కోల్పోవాల్సి వస్తుందన్నారు.

భాజపా (BJP) ఇప్పటివరకు రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. ఇంకా 12 స్థానాలకు అభ్యర్థులను కేటాయించలేదు. ఇందులో మాజీ సీఎం శెట్టర్‌ పోటీ చేయాలని భావిస్తున్న హుబ్బళి-ధార్వాడ్‌ నియోజకవర్గం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్‌ కేటాయింపు అంశంపై ఇప్పటికే దిల్లీ వెళ్లిన శెట్టర్‌ (Jagadish Shettar).. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అయినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ హైకమాండ్‌ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు టికెట్‌ కేటాయింపుపై పార్టీ నిర్ణయం కోసం ఆదివారం(ఏప్రిల్‌ 16) వరకు ఎదురుచూస్తా. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా. సీనియర్లకు టికెట్లు నిరాకరించడంపై భాజపా పునరాలోచించుకోవాలి. ఇది వచ్చే ఎన్నికల్లో భాజపాపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నాకు టికెట్‌ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలోని చాలా నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుందని మాజీ సీఎం యడియూరప్ప కూడా హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. నాకు టికెట్‌ ఇవ్వకపోతే.. భాజపా 20 నుంచి 25 సీట్లు కోల్పోయే అవకాశముంది. రాష్ట్రమంతటా కూడా ఆ ప్రభావం ఉంటుంది’’ అని శెట్టర్‌ (Jagadish Shettar) వ్యాఖ్యానించారు.

యువ నాయకులకు అవకాశం ఇచ్చేందుకు.. వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలని పార్టీ హైకమాండ్‌ తనకు సూచించినట్లు శెట్టర్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు తాను అంగీకరించలేదని, టికెట్ దక్కకపోతే రెబల్‌గా పోటీ చేస్తానని ఆయన హెచ్చరించారు. 

అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపా (BJP) ఇప్పటికే 212 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా 12 స్థానాలకు అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్లను పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వడం పార్టీలో అసమ్మతి రాజేసింది. ఇప్పటికే కీలక నేత లక్ష్మణ్ సవది సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు