TDP: తితిదే బడ్జెట్‌ను వైకాపా ఎలక్షన్‌ బడ్జెట్‌లా మార్చేశారు: తెదేపా నేత విజయ్‌కుమార్‌

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో(TTD) అదనపు నిధులు లేకుండా, బడ్జెట్ ఆమోదం పొందకుండా ₹1200 కోట్ల  కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు.

Updated : 06 Dec 2023 14:11 IST

మంగళగిరి: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో(TTD) అదనపు నిధులు లేకుండా, బడ్జెట్ ఆమోదం పొందకుండా ₹1200 కోట్ల  కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘కరుణాకర్‌ రెడ్డి ఛైర్మన్‌ కాగానే రూ.1,233 కోట్లకు కాంట్రాక్టులెలా ఇచ్చారు? బడ్జెట్‌ ఆమోదం లేకుండానే రూ.1,400 కోట్ల కాంట్రాక్టు పనులా? తితిదేలో అదనపు నిధులు లేకుండా కాంట్రాక్టు పనులు ఎలా చేయిస్తారు? బడ్జెట్‌లో ఒక ఖర్చు ఆపేస్తేనే కదా ₹1,233 కోట్లు పెట్టగలరు. తిరుపతి మున్సిపాలిటీకి ఒక శాతం నిధులపై విమర్శలతో ఆపారు. ఇప్పుడేమో శానిటేషన్‌ పేరుతో ₹80కోట్లు ఎలా ఇచ్చారు? ఇన్ని రోజులు తిరుపతిలో పారిశుద్ధ్యం ఎలా చేశారు? ఇంటి పన్ను, ఆస్తి పన్ను వసూలు చేసే ఇస్తున్నారు కదా? మరిప్పుడు శానిటేషన్‌ ఖర్చును తితిదే పెట్టడమేంటి? శానిటేషన్‌పై ఖర్చు పెట్టుకోలేని స్థితిలో తిరుపతి మున్సిపాలిటీ ఉందా? 

అదనపు ఈవో, ఛైర్మన్‌ ఇద్దరూ అనుకుంటే సరిపోతుందా? పరిపాలన అనుమతి ఎలా ఇచ్చారో ధర్మారెడ్డే చెప్పాలి. ఛైర్మన్‌, ఆయన కుమారుడు ఎన్నికల కోసం తితితే నిధుల్ని ఇలా దుర్వినియోగం చేస్తుంటే.. అడ్డుకోవాల్సింది పోయి.. మీరు ఎలా సహకరిస్తారు? హుండీ ఆదాయం కూడా నెలకు ₹130 కోట్లు దాటట్లేదు. తితిదే బడ్జెట్‌ను వైకాపా ఎలక్షన్‌ బడ్జెట్‌లా మార్చేశారు. తితిదే ఐదేళ్లలో జరిగిన ఇంజినీరింగ్‌ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు