Devendra Fadnavis: మహారాష్ట్రలో ఫలితాల ప్రకంపనలు.. రాజీనామాకు సిద్ధమైన ఉప ముఖ్యమంత్రి ఫడణవీస్‌

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకంపనలు రేపుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామాకు సిద్ధమయ్యారు. 

Published : 05 Jun 2024 15:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఉప ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) సిద్ధమయ్యారు. ఈమేరకు ఆయన పార్టీ కేంద్ర నాయకత్వానికి సమాచారం పంపించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ దెబ్బతింది. ఈనేపథ్యంలో రాష్ట్ర భాజపా నాయకత్వంలో కీలక పాత్ర పోషించిన ఆయనే వీటికి నైతిక బాధ్యత వహించారు. దీంతోపాటు ముఖ్యమంత్రి ఏక్‌నాద్‌ శిందేకు తన రాజీనామా లేఖను పంపించారు. 

‘‘మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు పూర్తిగా బాధ్యత స్వీకరిస్తున్నాను. నేనే ఇక్కడి పార్టీకి నాయకత్వం వహించాను. ప్రభుత్వ పదవి నుంచి నన్ను విడుదల చేయమని పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నాను. నేను అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలనుకుంటున్నాను’’ అని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

మహారాష్ట్రలో ఎన్డీయే అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం 48 స్థానాలకుగాను 2019 నాటితో పోలిస్తే రాష్ట్రంలో ఆ కూటమి బలం సగానికి పైగా తగ్గిపోయింది. భాజపా 9 సీట్లకే పరిమితమైంది. మహావికాస్‌ అఘాడీగా పోటీ చేసిన కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ పవార్‌) 29 స్థానాల్లో విజయం సాధించాయి.  సాంగ్లీ నుంచి కాంగ్రెస్‌ రెబల్‌ విశాల్‌ పాటిల్‌ ఒక్కరే విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని