TDP: ఓట్ల కక్కుర్తితో మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా?: దేవినేని ఉమా

34 లక్షల మంది వృద్ధులను సచివాలయాలకు రమ్మంటారా అని తెదేపా నేత దేవినేని ఉమా ప్రశ్నించారు.

Updated : 03 Apr 2024 14:58 IST

అమరావతి: ఓట్లు దండుకోవాలనే కక్కుర్తితో వైకాపా నేతలు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం 34 లక్షల మంది వృద్ధులను మండుటెండలో సచివాలయాలకు రమ్మంటారా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచాలపై వృద్ధులను ఊరేగిస్తూ తెదేపాపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

‘‘మీ కుట్రలో భాగస్వాములైనందుకు 9 మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది. వారిని ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టారు. ఇప్పటికైనా అధికారులు ప్రభు భక్తి మానుకోవాలి. ప్రతిపక్షాలపై విషప్రచారం చేస్తున్న వైకాపా నేతలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. అస్మదీయులకు ఖజానా దోచిపెట్టడవం వల్లే పింఛన్‌ డబ్బు జమ కాలేదు’’ అని దేవినేని ఉమా అన్నారు.  

మరోవైపు పింఛన్ల పంపిణీలో జాప్యంపై తెదేపా నేత వర్ల రామయ్య ఎన్నికల సంఘం, సీఎస్‌కు లేఖ రాశారు. ఇప్పటికీ నగదు సచివాలయాలకు అందలేదని పేర్కొన్నారు. వైకాపా కార్యకర్తలు మంచంపై వృద్ధులను మోసుకొస్తూ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని చెప్పారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల వద్దే పింఛను పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని తెదేపా డిమాండ్‌ చేస్తోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని