Lok Sabha Polls: బ్యాలెట్‌తో ఎన్నికలు జరగాలంటే.. అదొక్కటే మార్గం: దిగ్విజయ్‌ వ్యాఖ్యలు

ఈవీఎంలతో ఎన్నికల పోలింగ్‌ను తరచూ వ్యతిరేకిస్తోన్న దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి అదే వాదనను వినిపించారు.

Published : 31 Mar 2024 19:03 IST

అగర్‌మాల్వా: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ సింగ్‌ ఈవీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకే సీటు నుంచి 400 మంది నామినేషన్లు వేస్తే.. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందన్నారు.  ‘వైద నిభావో యాత్ర’ పేరిట చేపట్టిన ఎనిమిది రోజుల పాదయాత్రలో భాగంగా కసుస్నర్‌లోని కచ్నారియా గ్రామంలో మాట్లాడారు. రాజ్‌గఢ్‌లో ఈవీఎంలా లేదంటే బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఎన్నికలు జరగాలని కోరుకొంటున్నారా? అని అడగ్గా.. అక్కడి ప్రజలు బ్యాలెట్‌ ద్వారా జరపాలని నినాదాలు చేశారు.

దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఒకవేళ 400 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకు  సిద్ధమవుతున్నాను. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.25వేలు, రిజర్వ్‌డ్‌ కేటగిరీకి చెందినవారైతే రూ.12,500 చొప్పున డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. రాజ్‌గఢ్‌లో బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. ఏం జరుగుతుందో చూద్దాం..’’ అని పేర్కొన్నారు.  

దిగ్విజయ్‌ సింగ్‌ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వీటివల్లే భాజపా గెలుస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఒక్కో నియోజకవర్గానికి గరిష్ఠంగా 383 మంది అభ్యర్థులు ఉండొచ్చు. అదనంగా నోటా ఉండటంతో మొత్తం 384కు చేరుతుంది. నోటాతో పాటు మొత్తం 16 మంది అభ్యర్థులు ఒక బ్యాలెట్‌ యూనిట్‌లో కనిపించే వీలు ఉంటుంది. అలాంటివి 24 యూనిట్లను ఏకకాలంలో కంట్రోల్‌ యూనిట్‌కి అనుసంధానం చేయొచ్చు.  మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దుర్గ్‌కు చెందిన భాజపా నేత కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 384 మంది కన్నా ఎక్కువ మంది ఒక సీటు నుంచి నామినేషన్‌ వేస్తే బ్యాలెట్‌ పేపర్ల ద్వారానే ఈసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించాల్సి వస్తుందని కార్యకర్తలతో అన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని