Karnataka: సీఎం ఎంపికపై వీడని సస్పెన్స్‌.. ఖర్గేను కలిసిన డీకేఎస్‌

కర్ణాటక కొత్త సీఎం ఎవరో అనే అంశంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకేఎస్‌ దిల్లీలో తమ ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

Updated : 16 May 2023 19:17 IST

దిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్‌(Congress) పార్టీ అఖండ విజయం సాధించినప్పటికీ సీఎం ఎంపిక విషయంలో సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం పీఠం కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(డీకేఎస్‌) మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ మల్లగుల్లాలు పడుతోంది. తమ ప్రయత్నాలను ముమ్మరం చేసే ప్రయత్నంలో భాగంగా ఇద్దరు నేతలూ దిల్లీలో ఉన్నారు. మంగళవారం దిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్‌.. ఈ సాయంత్రం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. మరోవైపు, ఈ సాయంత్రం 6.30గంటలకు మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా ఖర్గేతో భేటీ కావడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.

సీఎం ప్రకటన రేపేనా?

కర్ణాటక సీఎం ఎంపికపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డీకేఎస్‌, సిద్ధరామయ్యతో భేటీ అయి చర్చించారని.. ఇప్పుడు సోనియా, రాహుల్‌ గాంధీతో చర్చించి ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో సీఎం ఎవరనే నిర్ణయం బుధవారం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, సీఎం పేరును బెంగళూరులోనే ప్రకటించే అవకాశం ఉంది.

రాహుల్‌ గాంధీ ఓటు సిద్ధరామయ్యకే..!

మరోవైపు, సీఎం (Karnataka CM) ఎంపిక విషయంపై మంగళవారం మధ్యాహ్నం ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సహా కర్ణాటక నుంచి కొందరు కాంగ్రెస్‌ నూతన ఎమ్మెల్యేలు, నేతలు కూడా పాల్గొన్నారు. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే బాగుంటుందని రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM)గా సీనియర్‌ నేత సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.  పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. కీలకమైన శాఖలతో ఉపముఖ్యమంత్రి హోదా కట్టబెట్టే అంశంపై డీకేకు సర్దిచెప్పేందుకు అధిష్ఠానం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు హైకమాండ్‌ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని శివకుమార్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఆ వార్తలు అవాస్తవం.. కాంగ్రెస్‌ నాకు అమ్మలాంటిది: డీకేఎస్‌

ఖర్గేను కలవడానికి ముందు డీకేఎస్‌ తన సోదరుడి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి డీకేఎస్‌ రాజీనామా చేస్తారంటూ వస్తోన్న వార్తలపై మండిపడ్డారు. అలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసే ఛానళ్లపై పరువు నష్టం కేసు పెడతానంటూ హెచ్చరించారు.  కాంగ్రెస్‌ పార్టీ తనకు తల్లిలాంటిదన్నారు. ఆ పార్టీని తాము పునర్నిర్మించామని తెలిపారు. సీఎం ఎవరు కావాలనే అంశంపై నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమన్నారు. అలాగే, ఈ ఉదయం ఆయన దిల్లీకి బయల్దేరే ముందు బెంగళూరులో మాట్లాడుతూ.. తాను ఎవరినీ వెన్నుపోటు పొడవనని.. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేయనని చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు