Tamil Nadu: తూత్తుకుడి స్థానంలో కనిమొళి, నీలగిరి నుంచి రాజా: అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే

తమిళనాడు(Tamil Nadu)లోని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల నిమిత్తం తొలివిడత అభ్యర్థులను ప్రకటించాయి.

Updated : 20 Mar 2024 12:21 IST

చెన్నై: సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్లపై పార్టీలు వరాలు జల్లు కురిపిస్తున్నాయి. అదే సమయంలో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తమిళనాడు(Tamil Nadu)లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే(DMK), అన్నాడీఎంకే(AIADMK) తమ అభ్యర్థులను ప్రకటించాయి.

డీఎంకే నేతల సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మేనిఫెస్టో విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ పరీక్షలపై నిషేధం వంటి వాగ్దానాలను అందులో ప్రస్తావించారు. అలాగే రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించామని చెప్పారు. ‘‘2014లో అధికారంలోకి వచ్చిన భాజపా పాలనలో దేశం వెనకబడింది. వారు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి. 2024లో మన కూటమి అధికారంలోకి వస్తుంది’’ అని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రధాని మోదీ చేస్తోన్న పర్యటనలపై స్పందిస్తూ.. ‘‘వరదల సమయంలో మోదీ పర్యటిస్తే సంతోషించేవాడిని’’ అని వ్యాఖ్యానించారు. 39 లోక్‌సభ స్థానాలకు గానూ 21 సీట్లకు డీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన సీట్లను కూటమిలోని మిత్రపక్షాలకు కేటాయించే అవకాశాలున్నాయి. కీలక నేతలైన కనిమొళి, దయానిధి మారన్‌ను తూత్తుకుడి, చెన్నై సెంట్రల్‌ నుంచి బరిలో దింపింది. కేంద్రమాజీ మంత్రి ఏ రాజా.. నీలగిరి నుంచి పోటీ చేయనున్నారు.

కాంగ్రెస్‌.. ‘పంచ’తంత్రం

మరోపక్క.. అన్నాడీఎంకే తొలివిడతలో 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఈ జాబితా విడుదల చేశారు. ఏడు దశల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు తొలివిడత ఓటింగ్ ఏప్రిల్‌ 19న జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని