Lok Sabha Polls: ₹75కే లీటర్‌ పెట్రోల్‌.. ₹500కే గ్యాస్‌ సిలిండర్‌.. టోల్‌ బూత్‌లు ఎత్తేస్తాం: డీఎంకే హామీలు

దేశంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. తమ కూటమిని గెలిపిస్తే అమలు చేసే హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు.

Updated : 20 Mar 2024 21:19 IST

చెన్నై: దేశాన్ని మోదీ (PM Modi) సర్కార్‌ నాశనం చేసిందని డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (MK Stalin) విమర్శించారు.  త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) ‘ఇండియా’ కూటమి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం తమ పార్టీ తరఫున లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘ఇండియా’ కూటమిని గెలిపిస్తే ప్రజలకు రూ.75 పెట్రోల్‌, రూ.65కే డీజిల్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేస్తామన్నారు. రైతులు, విద్యార్థులకు రుణమాఫీ చేయడంతో పాటు మహిళలందరికీ నెలకు రూ.1000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. జాతీయ రహదారులపై టోల్‌ బూత్‌లను పూర్తిగా ఎత్తివేస్తామన్నారు. జాతీయ విద్యావిధానం, నీట్‌ పరీక్ష, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లను తమిళనాడులో అమలుచేయబోమని హామీ ఇచ్చారు. 

డీఎంకే మేనిఫెస్టోలో మరికొన్ని హామీలివే..

  • ‘ఇండియా’ కూటమి గెలిస్తే నీతిఆయోగ్‌ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనలు స్వీకరించేందుకు మళ్లీ ప్రణాళికా సంఘం ఏర్పాటు
  • జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు అక్కడ ఎన్నికలు జరుపుతాం. 
  • నూతన విద్యావిధానం 2020ని రద్దు చేస్తాం. ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తాం. 
  • అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకొని దాని స్థానంలో భారత సాయుధ దళాల్లో శాశ్వత రిక్రూట్‌మెంట్‌ సర్వీస్‌ను తిరిగి ప్రవేశపెడతాం. 
  • ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించేందుకు వీలు కల్పించే ఆర్టికల్‌ 356ను తొలగించేందుకు డీఎంకే గట్టిగా కృషి చేస్తుంది.
  • మహిళలకు పార్లమెంటు, అసెంబ్లీల్లో 33శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలుచేస్తాం.
  • రాజ్యాంగ పీఠికలో పేర్కొన్నట్లు భారతదేశ లౌకిక స్వభావాన్ని కాపాడటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటాం. 
  • పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను రద్దు చేసి మైనార్టీలందరినీ వివక్ష లేకుండా సమానంగా పరిగణిస్తాం. ముస్లింలు, ఇతర మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సచార్‌ కమిటీ చేసిన సిఫారసులను అమలుచేస్తాం. తమిళనాడు తరహాలో దేశమంతా మైనార్టీలకు రిజర్వేషన్లు అమలుకు కృషిచేస్తాం. 
  • శ్రీలంక తమిళ శరణార్థులు భారత పౌరసత్వం పొందేలా వెసులుబాటు కల్పిస్తాం. శ్రీలంకకు తిరిగి వెళ్లాలనుకునే వారికి సహాయం అందిస్తాం. 
  • ఒకే దేశం -ఒకే ఎన్నికలు ప్రతిపాదనను విరమిస్తాం. రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల కేటాయింపు కోసం 1971 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుంది. 
  • గత పదేళ్లలో భాజపా సర్కారు ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే సమీక్షిస్తాం. కార్మిక వ్యతిరేక విధానాలను సంస్కరిస్తాం. 
  • ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ద్వారా కేంద్ర ప్రభుత్వం నెలకు కనీసం రూ.5,000 పెన్షన్‌ను అందజేసేలా చర్యలు తీసుకుంటాం.
  • మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిదినాలు 100 నుంచి 150 రోజులకు పెంచుతాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.400లు చొప్పున వేతనం అందిస్తాం. 
  • ప్రజలతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్లను కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వర్సిటీలకు వీసీలను నియమించేలా సంబంధిత చట్టాలకు సవరణలు తీసుకొస్తాం. 
  • ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటంతో పాటు, సేతుసముద్రం ప్రాజెక్టును అమలుచేయడం, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిషేధిత చట్టం, చెన్నైలో సుప్రీంకోర్టు శాఖ ఏర్పాటు, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడం, తమిళంతో సహా అన్ని రాష్ట్రాల భాషలకు సమానంగా నిధుల కేటాయింపు తదితర వాగ్దానాలు చేశారు. 

మరోవైపు, తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు ఉండగా ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న డీఎంకే 21 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా 18 సీట్లను కాంగ్రెస్‌, వామపక్షాలతో పాటు మిత్రపక్షాలకు కేటాయించింది. ఇందులో తొమ్మిది సీట్లలో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని