Ts Assembly: ప్రభుత్వ ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం: ఈటల రాజేందర్‌

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రభుత్వాన్ని కోరారు. 

Updated : 04 Aug 2023 19:51 IST

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో శుక్రవారం విద్య, వైద్యంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ...కంటింజెంట్‌ సిబ్బందికి కనీసం రూ.10వేలు వేతనం చెల్లించాలన్నారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు లేని దుస్థితి నెలకొందన్నారు. కేజీబీవీ సిబ్బందిని చాలా రాష్ట్రాల్లో క్రమబద్ధీకరించారని.. తెలంగాణలోనూ బోధన, బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరించాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కేజీబీవీ సిబ్బందికి రూ.30వేలకుపైగా వేతనాలు ఇస్తున్నట్లు చెప్పారు. జూనియర్‌ కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల వేతనం చెల్లించి.. ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయాలన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిర్వీర్యం అవుతున్నాయని ఈటల అన్నారు. పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ వర్సిటీల్లో కొత్త హాస్టళ్లు నిర్మించాలన్నారు. ఉస్మానియా వర్సిటీ 18 ర్యాంకులు కోల్పోయిందన్నారు. అప్‌గ్రేడ్‌ చేసిన ఆస్పత్రులకు అదనపు నిధులు ఇవ్వడం లేదని.. వైద్య సిబ్బందిని కేటాయించడం లేదన్నారు. ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోంది కానీ.. అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలు, వసతులను పెంచాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని