Election Commission: మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్‌ ఘోష్‌, సుప్రియా శ్రీనేత్‌లకు ఈసీ షోకాజ్‌ నోటీసులు

భాజపా ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Updated : 27 Mar 2024 17:30 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.  బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా దిలీప్‌ ఘోష్‌, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు సుప్రియా శ్రీనేత్‌లకు నోటీసులు పంపింది. మార్చి 29 సాయంత్రం లోగా వీటిపై తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు అమర్యాదకరంగా, చెడు అభిప్రాయంతో కూడుకున్నవిగా ఉన్నాయని ఈసీ పేర్కొంది. వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించామని, ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు గౌరవప్రదంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించింది. 

బెంగాల్‌లోని బర్దమాన్‌ - దుర్గాపూర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన దిలీప్‌ఘోష్‌ ఇటీవల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై టీఎంసీ శ్రేణులు మండిపడుతున్నాయి. అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న సినీనటి కంగనా రనౌత్‌కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్ట్‌ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ మహిళా నేత సుప్రియాశ్రీనేత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అధికారిక ఖాతాలో ఇది కనిపించడంతో భాజపా వర్గాలు భగ్గుమన్నాయి. ఆ పోస్టు తాను చేసింది కాదని సుప్రియ స్పష్టం చేశారు. తన అకౌంట్‌ చాలామంది యాక్సెస్‌ చేస్తుంటారని.. ఈ విషయం తన దృష్టికి రాగానే పోస్ట్‌ను తొలగించినట్లు తెలిపారు. ఎవరు ఆ పనిచేశారో తేల్చే పనిలో ఉన్నానంటూ ఆమె వివరణ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసీ వీరిద్దరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని