Kishan Reddy: మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్‌రెడ్డి

ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు.

Updated : 18 Apr 2024 12:05 IST

హైదరాబాద్‌: ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. తాము ఎవరికీ బీ టీం కాదని చెప్పారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

తెలంగాణలో 12కు పైగా స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా ఈటల అనేక ఉద్యమాలు చేశారని.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని చెప్పారు. మల్కాజిగిరిలో ఆయన్ను గెలిపిద్దామన్నారు. ఐకమత్యంతో పనిచేయాలని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. నామినేషన్‌ వేసిన తర్వాత డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ చేయాలని అధిష్ఠానం సూచించిందని..  కేడర్ అంతా ప్రచారంలో పాల్గొనాలన్నారు. ఇప్పటి వరకు దేశానికి ఏం చేశాం.. ఏం చేయబోతున్నామనేది ప్రజలకు వివరించాలని చెప్పారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కీలకమని.. అక్కడ పార్టీ అభ్యర్థి వంశ తిలక్‌ను గెలిపించాలని కోరారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని.. ఈ విషయంలో తనకు పూర్తి విశ్వాసముందన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసినా తమ గెలుపును ఆపలేదని చెప్పారు.

నామినేషన్‌ ర్యాలీకి భారీగా తరలివచ్చిన భాజపా కార్యకర్తలు

ఈటల రాజేందర్‌ నామినేషన్‌ ర్యాలీలో భాజపా కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈటల తన నివాసం నుంచి పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఊరేగింపుగా బయల్దేరారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఈటల రాజేందర్‌తో పాటు మరో నలుగురు నేతలను మాత్రమే లోపలికి అనుమతించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని