Etela Rajender: రాష్ట్రంలో భాజపాయే ప్రత్యామ్నాయం

రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం భాజపాదే అని లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు సంకేతం ఇచ్చారని ఆ పార్టీ ముఖ్యనేత, మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికైన ఈటల రాజేందర్‌ అన్నారు.

Published : 06 Jun 2024 04:08 IST

లోక్‌సభ ఎన్నికల్లో సంకేతం ఇచ్చిన ప్రజలు: ఈటల

బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పరస్పరం అభినందనలు తెలుపుకొంటున్న ఈటల రాజేందర్, రఘునందన్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం భాజపాదే అని లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు సంకేతం ఇచ్చారని ఆ పార్టీ ముఖ్యనేత, మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికైన ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు భాజపానే ప్రత్యామ్నాయమని ప్రజలు స్పష్టం చేశారని వివరించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. మల్కాజిగిరి సీటు కాంగ్రెస్‌దే అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా ఆయనకు భంగపాటు తప్పలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ప్రజల అవసరాల దృష్ట్యా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడమే తమ కర్తవ్యమన్నారు. ‘‘అసెంబీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా బలం గణనీయంగా పెరిగింది. భాజపా ఓట్లు 22 శాతం పెరిగితే కాంగ్రెస్‌కి ఒక్క శాతం కూడా ఓట్లు పెరగలేదు. కాంగ్రెస్‌ గెలిచింది మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకతతోనే తప్ప సొంత బలంతో కాదు. నిజంగా కాంగ్రెస్‌కి బలం ఉంటే మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌లో ఎందుకు గెలవలేదు? లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అంతా కూడా మూడోసారి మోదీ ప్రధాని కావాలని ఓటు వేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం తీసుకుంటాం. తెలంగాణలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించడం మా బాధ్యత. కాంగ్రెస్‌ పూర్తి పదవీకాలం పాలన కొనసాగించాలని కోరుకుంటున్నాం. దానంతట అది పడిపోతే మేమేమీ చేయలేం’’ అని వ్యాఖ్యానించారు.

ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదు: రఘునందన్‌రావు

మెదక్‌ లోక్‌సభ ఎన్నికలో ఎవరి దయాదాక్షిణ్యాలపై తాను గెలవలేదని భాజపా నేత, మెదక్‌ నుంచి ఎంపీగా నెగ్గిన రఘునందన్‌రావు అన్నారు. సొంత జిల్లాలో ఎంపీని గెలిపించుకోలేక సీఎం మాట్లాడుతున్నారని అన్నారు. ఎనిమిది స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్‌కు భారాస ఓటు బదిలీ అయిందా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తనకు మద్దతు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని