Tamilisai: మళ్లీ భాజపాలో చేరిన మాజీ గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మళ్లీ భాజపాలో చేరారు. చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated : 20 Mar 2024 14:16 IST

చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan ) తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గవర్నర్‌ పదవితో పాటు పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన ఆమె.. భారతీయ జనతా పార్టీలో (BJP) చేరారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకొన్నారు. గతంలో భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన తమిళిసై మరోసారి ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రజా సేవ చేసేందుకే తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు చెప్పారు. త్వరలో భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. తమిళనాడులో కమలం వికసిస్తుందని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో తన ఉనికిని విస్తరించాలని భావిస్తున్న భాజపాకు.. తమిళిసై రాక కొత్త ఉత్సాహాన్నిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

తమిళిసై రాకను పార్టీ అధ్యక్షుడు అన్నామలై స్వాగతించారు. ఆమె పాలనా అనుభవం, ప్రజలకు సేవల చేయాలన్న తపనను కొనియాడారు. ఎన్డీయే ఈ సారి 400 సీట్లు సాధించి తీరుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మరోవైపు తమిళిసై రాజీనామా నేపథ్యంలో తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌.. అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని