AP news: సొంతూర్లోనే చుక్కెదురు!

వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాల్లోనే కాదు....స్వగ్రామాల్లోనూ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు బయటపడింది. మరికొన్ని చోట్ల వారు ఓటు వేసిన పోలింగ్‌ బూత్‌ల్లోనూ వెనకబడ్డారు.

Updated : 06 Jun 2024 07:50 IST

పలువురు వైకాపా అభ్యర్థులకు ఎదురుగాలి
కొందరికి ఓటేసిన వార్డుల్లోనూ ఆధిక్యత రాలేదు

ఈనాడు, అమరావతి: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాల్లోనే కాదు....స్వగ్రామాల్లోనూ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు బయటపడింది. మరికొన్ని చోట్ల వారు ఓటు వేసిన పోలింగ్‌ బూత్‌ల్లోనూ వెనకబడ్డారు. అక్కడ కూటమి తరఫున పోటీచేసిన తెదేపా, మిత్రపక్షాల అభ్యర్థులు అనూహ్య మెజారిటీ సాధించారు. శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకు చాలాచోట్ల ఇదే తీరు కనిపించింది. వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థుల సొంతూర్లలో ఓటర్లు ప్రత్యర్థి పార్టీల వైపు మొగ్గు చూపి ఝలక్‌ ఇచ్చారు. 

  • విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్‌ నివాసం ఉంటున్న గుణదలలోనూ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ వైపే ఓటర్లు మొగ్గుచూపారు. 39వ పోలింగ్‌ కేంద్రంలో అవినాష్‌ కంటే 110 ఓట్ల మెజార్టీ రామ్మోహన్‌కు వచ్చింది.  
  • మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు నివాస ప్రాంతమైన రామానాయుడుపేట పరిధిలో కూటమికి చెందిన కొల్లు రవీంద్రకే ప్రజలు పట్టంకట్టారు. ఇక్కడ 103, 104 పోలింగ్‌బూత్‌లు ఉండగా రెండింటిలోనూ రవీంద్ర ఆధిక్యత చాటుకున్నారు. 103వ బూత్‌లో రవీంద్రకు 515 ఓట్లు వస్తే కిట్టుకు 220 ఓట్లు వచ్చాయి. 104వ బూత్‌లో కొల్లుకు 579 ఓట్లు రాగా కిట్టు 346 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 
  • ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి స్వగ్రామం రాయన్నపాలెంలో తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌కు 154 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇదే జిల్లా ఉంగుటూరు వైకాపా అభ్యర్థి పుప్పాల వాసుబాబు సొంత గ్రామం నిడమర్రు మండలం బువ్వనపల్లిలో కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజుకు 1,381 ఓట్ల ఆధిక్యం లభించింది
  • పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును సొంత గ్రామ ప్రజలే తిరస్కరించారు. ఆయన స్వస్థలం అత్తిలిలో కూటమి అభ్యర్థి రాధాకృష్ణకు 9,629  దక్కగా .. నాగేశ్వరరావుకు కేవలం 2,983 ఓట్లే వచ్చాయి. కారుమూరి ఓటేసిన 114వ నంబరు పోలింగ్‌ కేంద్రంలో రాధాకృష్ణకు 639, నాగేశ్వరరావుకు 169 ఓట్లు పడ్డాయి. 
  • కోనసీమ జిల్లా అమలాపురం వైకాపా అభ్యర్థి పినిపే విశ్వరూప్‌ సొంత గ్రామం భట్నవిల్లిలో కూడా కూటమిదే ఆధిక్యం. ఇక్కడి 118వ పోలింగ్‌ కేంద్రంలో విశ్వరూప్‌ కుటుంబానికి ఓట్లు ఉన్నాయి.  తెదేపాకు 543 ఓట్లు రాగా, వైకాపాకు 395 ఓట్లే వచ్చాయి. 
  • కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ  వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామం గోపాలపురంలో కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుకు 472 ఓట్ల మెజారిటీ వచ్చింది.
  • పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు స్వగ్రామం శావల్యాపురం మండలం వేల్పూరులో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆధిక్యం వచ్చింది. అసెంబ్లీ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులకు వైకాపా అభ్యర్థి కంటే 660 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కూటమి పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు వైకాపా అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌కంటే 715 ఓట్లు అధికంగా రావడం విశేషం.
  • కృష్ణా జిల్లా అవనిగడ్డ వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్‌బాబు స్వగ్రామం బందలాయిచెరువులో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ మెజారిటీ సాధించారు. ఇక్కడ రమేశ్‌బాబుకు 342 ఓట్లు రాగా బుద్ధప్రసాద్‌ 574 ఓట్లు సాధించారు. 
  • ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు స్వస్థలమైన చందర్లపాడులో తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్యకు 910 ఓట్ల మెజారిటీ వచ్చింది. గ్రామంలో ఆయన ఓటేసిన 16వ పోలింగ్‌ కేంద్రంలోనూ తెదేపాకు 188 ఓట్లు ఆధిక్యం వచ్చింది. 
  • ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం వైకాపా అభ్యర్థి తిరుపతిరావు స్వగ్రామం మైలవరంలో తెదేపాకు 3,880 ఓట్ల భారీ మెజారిటీ లభించింది. పంచాయతీలో 17 పోలింగ్‌ బూత్‌ల్లో కేవలం ఒక బూత్‌లోనే వైకాపాకు ఆధిక్యం రాగా, మిగతా 16 వార్డుల్లో తెదేపాకే భారీ ఆధిక్యతలు రావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైకాపా అభ్యర్థికి 374 ఓట్ల మెజార్టీ లభించింది.
  • ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు ఇలాకాలో ఆధిక్యం వచ్చింది. స్వామిదాసు నివాసం ఉంటున్న శాంతినగర్‌ ఏడో వార్డులో కొలికపూడి 159 ఓట్ల మెజారిటీ సాధించారు. 
  • అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి స్వగ్రామం ఉంతకల్లులో తెదేపా అభ్యర్థి కాలువ శ్రీనివాసులుకు 364 ఓట్ల మెజార్టీ లభించింది. ఉరవకొండ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి స్వస్థలమైన రాకెట్లలో తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు 68 ఓట్లు మెజార్టీ దక్కింది. శింగనమల వైకాపా అభ్యర్థి వీరాంజనేయులు స్వగ్రామం సి.బండమీదపల్లిలో తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకి 71 ఓట్ల ఆధిక్యత వచ్చింది. 
  • చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం పాదిరికుప్పం. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి స్వస్థలం. ఈమె వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ పంచాయతీలో ఎన్డీయే అభ్యర్థి థామస్‌ ఆధిక్యతను కనబరిచారు. ఇక్కడ. ఎన్డీయే అభ్యర్థికి 408, వైకాపాకు 391 ఓట్లు వచ్చాయి. 
  • పలమనేరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటేగౌడ స్వస్థలం వి.కోట మండలం తోట కనుమ. ఇక్కడ మూడు బూత్‌లు ఉంటే రెండు చోట్ల ఎన్డీయే అభ్యర్థి అమర్నాథ్‌రెడ్డికి మెజారిటీ వచ్చింది. 152వ పోలింగ్‌ కేంద్రంలో వైకాపాకు 195 ఓట్ల ఆధిక్యం రాగా, 153, 154వ పోలింగ్‌ కేంద్రంలో ఎన్డీయేకు మెజారిటీ వచ్చింది.
  • కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన తోట నరసింహం స్వగ్రామం కిర్లంపూడి మండలం వీరవరం. ఆ గ్రామంలో నరసింహంకు మొత్తం 1566 ఓట్లు రాగా తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు 1,878 ఓట్లు వచ్చాయి.

  • పీలేరు వైకాపా అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి స్వగ్రామం వాల్మీకిపురం మండలం జర్రావారిపల్లె. 1988 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆయనకు సొంతూరు ప్రజలే ఝలక్‌ ఇచ్చారు. ఇక్కడ పోలింగ్‌ కేంద్రం-125లో తెదేపాకు 353 ఓట్లు రాగా.. వైకాపాకు 340 ఓట్లు మాత్రమే వచ్చాయి. తెదేపా అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి 13 ఓట్ల ఆధిక్యత కనబరిచారు.

  • వైకాపా అధినేత జగన్‌ మేనమామ కమలాపురం వైకాపా అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డికి సొంత బూత్‌లో పరాభవం ఎదురైంది. ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న కమలాపురం నగర పంచాయతీ కె.అప్పాయపల్లెలోని 15వ వార్డు 27వ బూత్‌లో 333 ఓట్లు ఉండగా 285 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తెదేపా అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్యరెడ్డికి 141 ఓట్లు రాగా రవీంద్రనాథ్‌రెడ్డికి 132 ఓట్లు వచ్చాయి. తెదేపా అభ్యర్థికి అక్కడ తొమ్మిది ఓట్ల ఆధిక్యం లభించింది.

  • నరసన్నపేట నియోజకవర్గం వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌ సొంత గ్రామం పోలాకి మండలం మబగాంలో తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 388 ఆధిక్యత వచ్చింది. ఇచ్ఛాపురం వైకాపా అభ్యర్థి పిరియా విజయ స్వస్థలం పలాసపురంలో తెదేపా అభ్యర్థి బెందాళం అశోక్‌ 549 మెజారిటీ సాధించారు. పాతపట్నం నియోజకవర్గం వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి స్వగ్రామం అచ్యుతాపురంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ తెదేపా అభ్యర్థి మామిడి గోవిందరావు 372 ఆధిక్యత సాధించారు. ఆమదాలవలస నియోజకవర్గ వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం సొంతగ్రామం తొగరాంలో తెదేపా అభ్యర్థి కూన రవికుమార్‌కి 150 ఓట్ల మెజారిటీ వచ్చింది. 

  • తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఓటు వేసిన 194వ నంబరు పోలింగ్‌ కేంద్రంలో 105 ఓట్ల ఆధిక్యతను బలరామకృష్ణ కనబరిచారు. రాజానగరం మండలంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వైకాపా కంటే ఒక్కఓటు జనసేనకు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎన్నికల ప్రచార సభలో రాజా ప్రకటించడం గమనార్హం.

  • తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత స్వగ్రామమైన దేవరపల్లి మండలం యర్నగూడెంలో తెదేపా 25 ఏళ్ల తరువాత మెజారిటీ సాధించింది. ఇక్కడ తెదేపా అభ్యర్థి వెంకటరాజు 581 ఓట్ల ఆధిక్యత పొందారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని