Exit Polls: ఎగ్జిట్‌ పోల్స్‌కి విలువ లేదు.. మమత రియాక్షన్‌ ఇదే!

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.

Published : 03 Jun 2024 00:03 IST

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల విజయావకాశాలపై పలు సర్వే సంస్థలు వెలువరించిన ఎగ్జిట్‌పోల్స్‌కు విలువ లేదని పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు.  ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ను రెండు నెలల క్రితమే ‘ఇంట్లో తయారుచేసినవి’గా పేర్కొన్న దీదీ.. అవి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేవని తెలిపారు. బెంగాల్‌లో 2016, 2019, 2021లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా చేశారో చూశామని, ఆ అంచనాలేవీ నిజం కాలేదని విమర్శించారు. తన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రజా స్పందన ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను ధ్రువీకరించడంలేదన్నారు.

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌... మై యాక్సిస్‌ ఇండియాటుడే అంచనాలివే

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను ముస్లింలు తీసుకొంటున్నారంటూ ఓట్లు సమీకరించేందుకు భాజపా ప్రయత్నించిందని.. అందువల్ల ముస్లింలు ఆ పార్టీకి ఓటు వేస్తారని తాను భావించడంలేదన్నారు.  బెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు భాజపాకు సహకరించి ఉండొచ్చని ఆరోపించారు. శనివారం సాయంత్రం వెలువడిన అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి హ్యాట్రిక్‌ విజయం సాధించబోతోందంటూ అంచనా వేసిన విషయం తెలిసిందే. అలాగే, బెంగాల్‌లోనూ తృణమూల్‌ కాంగ్రెస్‌ కంటే భాజపాకే ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్న నేపథ్యంలో మమత పైవిధంగా స్పందించారు. 

‘ఇండియా’ కూటమికి ఉన్న అవకాశాలపై స్పందించిన దీదీ.. అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, స్టాలిన్‌తో పాటు అన్నిచోట్లా ప్రాంతీయ పార్టీలు మెరుగైన పనితీరు కనబరుస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. బెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్‌తో తనకు ఉన్న వైరం.. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే కేంద్రంలో ప్రభుత్వంలో చేరే అవకాశాలపై ప్రభావం చూపుతుందా? అని విలేకర్లు ప్రశ్నించగా.. సీపీఎం జోక్యం చేసుకుంటే తప్ప జాతీయస్థాయిలో ఎలాంటి అడ్డంకులూ ఉండవని భావిస్తున్నానన్నారు. ప్రతి ప్రాంతీయ పార్టీకీ తనదైన సొంత గౌరవం ఉంటుందని,  అందరితో మాట్లాడాక తమను ఆహ్వానిస్తే ‘ఇండియా’ కూటమిలోకి వెళ్తామన్నారు. ఇతర ప్రాంతీయ పార్టీలను సైతం వెంట తీసుకెళ్తామన్నారు. అంతకన్నా ముందు ఫలితాలు రానివ్వండి అంటూ దీదీ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని