Elections: ‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్‌ పట్నాయక్‌ కౌంటర్‌

భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గట్టికౌంటర్ ఇచ్చారు.

Published : 19 May 2024 00:06 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాల్లో హీటుపుట్టించారు. ఒడిశాలో మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలపై బిజూ జనతాదళ్‌ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ శనివారం గట్టి కౌంటర్‌ ఇచ్చారు. వారిని పొలిటికల్‌ టూరిస్ట్‌లుగా పేర్కొన్న ఆయన.. ఒడిశాను దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా చేస్తామంటూ చేసిన హామీలపై మండిపడ్డారు. ముందు మీ రాష్ట్రాల్లో పరిస్థితి చూసుకోండని సలహా ఇచ్చారు. 

ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒడిశాలో భాజపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా  అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలపై నవీన్‌ పట్నాయక్‌ ఓ వీడియో సందేశం ద్వారా స్పందించారు. ‘‘అస్సాం తలసరి అప్పు ఒడిశా కంటే రెట్టింపు ఉంది. మీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకోండి. మీ మాటలకు ఒడిశా ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.  వీరంతా పొలిటికల్‌ టూరిస్టులని, కేవలం ఎన్నికలప్పుడు వచ్చి తర్వాత అదృశ్యమవుతారని తెలిపారు. వారు చేసిన ప్రసంగాలు రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపబోవన్నారు. 

తమ పార్టీ నాయకుల్ని పొలిటికల్‌ టూరిస్ట్‌లుగా పేర్కొనడంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు పొలిటికల్‌ టూరిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు. నవీన్‌ పట్నాయక్ ప్రచారానికి తనతో పాటు ఎవరినీ పెట్టుకోలేక.. తమిళనాడు నుంచి ఒక వ్యక్తిని నియమించుకున్నారని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని