TDP-Janasena: తెదేపా-జనసేన తొలి జాబితా.. శనివారం కీలక ప్రకటన?

పొత్తులు, ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేసే దిశగా తెలుగుదేశం-జనసేన కసరత్తు ముమ్మరం చేశాయి. 

Updated : 24 Feb 2024 11:24 IST

అమరావతి: నేతలు, కార్యకర్తలు, ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న తెలుగుదేశం-జనసేన అభ్యర్థుల తొలి జాబితా శనివారం ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగా ఇరు పార్టీల అధినేతలు కసరత్తు ముమ్మరం చేశారు. రేపు ఉదయం 11 గంటల తర్వాత ఇరు పార్టీల అధినేతలు ఒకే వేదికపైకి వచ్చి అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతకంటే ముందు అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో ఉదయం 9గంటలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈమేరకు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, కొల్లు రవీంద్ర, చిన రాజప్ప, నక్కా ఆనంద్‌బాబు తదితర నేతలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై ముఖ్యనేతలతో అధినేత చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

పొత్తులు, ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేసే దిశగా తెలుగుదేశం-జనసేన కసరత్తు ముమ్మరం చేశాయి. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై పార్టీ నేతలు, శ్రేణులకు స్పష్టత ఇచ్చే ప్రక్రియను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ వేగవంతం చేశారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు, లోకేశ్‌ హైదరాబాద్‌ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోగా.. పవన్‌ కల్యాణ్‌ విడిగా అమరావతికి చేరుకున్నారు. దీంతో అభ్యర్థుల ప్రకటనపై ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు భాజపాతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది. అప్పటి వరకు వేచి చూడకుండా తొలి జాబితాను ప్రకటించి కార్యకర్తల్లో జోష్ పెంచాలని ఇరుపార్టీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అప్పటిలోగా భాజపాతో  పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాల అంచనా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని