Ganta: సీఎం జగన్‌ విశాఖ ద్రోహి.. ఇక్కడి నుంచే వైకాపా పతనం మొదలు: గంటా

రైల్వే జోన్‌ కోసం 53 ఎకరాలు కేటాయించకుండా... సీఎం జగన్‌ విశాఖ ద్రోహిగా మిగిలిపోయారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

Updated : 01 Feb 2024 20:45 IST

విశాఖపట్నం: రైల్వే జోన్‌ కోసం 53 ఎకరాల భూమి కేటాయించకుండా.. సీఎం జగన్‌ విశాఖ ద్రోహిగా మిగిలిపోయారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వైకాపా విముక్త ప్రాంతంగా చేసుకునేందుకు ఇప్పటికే నగరవాసులు సిద్ధమయ్యారన్నారు. కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీని చేశారంటూ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ధ్వజమెత్తారు.

‘‘రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విశాఖలో భూ దోపిడీకి పాల్పడ్డారు. రూ.లక్షల కోట్ల విలువైన వేల ఎకరాల భూములను మీరు, మీ సామంత రాజులు దోచుకున్నారు. కానీ, విశాఖ రైల్వే జోన్‌ కోసం స్థలం దొరకలేదా? విశాఖలో మీకు వీరవిధేయత ప్రదర్శించే అస్మదీయులకు కావాల్సినంత దోచి పెట్టేశారు. విలాసవంతమైన రాజభవనాల కోసం రూ.వందల కోట్లతో కట్టుకున్న రాజకోటకు మాత్రం భూమి దొరికింది. ఐదేళ్లలో మీరు, మీ నాయకులు విశాఖలో ఎంతెంత దాచుకున్నారో, దోచుకున్నారో లెక్కలతో సహా చెప్పడానికి మేం సిద్ధం’’ అన్నారు.

విశాఖ నుంచే మీ పతనం ప్రారంభం..

‘‘విశాఖ రైల్వే జోన్‌ కోసం 53 ఎకరాల భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం. ఏపీ  ప్రభుత్వం ఇంకా భూమి అప్పగించలేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్‌ సిద్ధమైంది.. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలుపెడతామని కేంద్ర మంత్రి స్పష్టంగా చెబుతున్నారు. విశాఖకు రైల్వే జోన్‌ రాకపోవడానికి కారణం మీరేనని కేంద్రం స్పష్టంగా చెబుతోంది. ఇప్పటికైనా కళ్లు తెరవండి జగన్‌. రైల్వే జోన్‌ అనేది ఉత్తరాంధ్ర ప్రజల మూడు దశాబ్దాల కల. మీరు మా మనోభావాలతో ఆడుకోవద్దు. విశాఖలో మీరు దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టి ఉంటే ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ కల రైల్వే జోన్‌ ఎప్పుడో నెరవేరేది. జోన్‌ కోసం స్థలం కేటాయించకుండా, జోన్‌ రాకుండా ఉండడానికి కారణమైన మీరు వచ్చే ఎన్నికలకు సిద్ధమా? అని ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో మీ పతనం విశాఖ నుంచే మొదలవుతుంది జగన్‌’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని