Electoral bonds: ఫ్యూచర్‌ గేమింగ్‌ నుంచి వైకాపాకు ₹150 కోట్లు

Electoral bonds: డీఎంకేకు అధికంగా విరాళాలు ఇచ్చిన ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైకాపాకు రూ.150 కోట్లు విరాళం ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది.

Updated : 21 Mar 2024 22:35 IST

దిల్లీ: రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తాజాగా ఇచ్చిన సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) తన వెబ్‌సైట్‌లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? బాండ్ల సీరియల్‌ నంబర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. అత్యధికంగా రూ.1368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసిన ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా నిధులు సమకూర్చింది. రూ.150 కోట్లను బాండ్ల రూపంలో ఇచ్చినట్లు వెల్లడైందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇదే కంపెనీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP)కి రూ.50 కోట్లు విరాళం ఇచ్చినట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి రూ.285 కోట్ల మేర విరాళం ఇచ్చినట్లు పీటీఐ ప్రాథమికంగా వెల్లడించింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు రూ.509 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఇప్పటికే వెల్లడైంది. ఆ కంపెనీ ఇచ్చిన మొత్తం విరాళాల్లో స్టాలిన్‌ పార్టీకే అధికంగా వెళ్లినట్లు తేలింది. ఈసీ వెల్లడించిన పూర్తి డేటాతో వైకాపాకు కూడా పెద్ద మొత్తంలో విరాళం అందినట్లు తేలింది.

ఎవరీ లాటరీ కింగ్‌?

ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌ సంస్థ యజమాని, లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌. తొలినాళ్లలో మయన్మార్‌లో కూలీగా పనిచేశారు. 1988లో భారత్‌కు తిరిగి వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. దానిని కర్ణాటక, కేరళకు విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్‌కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్లకు భూటాన్‌, నేపాల్‌లో కూడా తన బిజినెస్‌లను మొదలుపెట్టారు. స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్‌టైల్‌, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు.

ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ లాటరీ ట్రేడ్‌ అండ్‌ అలైడ్‌ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్‌ వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వరల్డ్‌ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంది. ఇది ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంది. ఫ్యూచర్‌ గేమింగ్ సంస్థపై వివాదాలు కూడా భారీగానే ఉన్నాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై ఈడీ పలుమార్లు దాడులు చేసింది. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్‌ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. మార్టిన్‌ కంపెనీలు బహుమతి పొందిన టికెట్లను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2011లో కోయంబత్తూర్‌లో మార్టిన్‌పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. భూ ఆక్రమణలు, మోసం చేయడం వంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని