Galla jayadev: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా: గల్లా జయదేవ్‌

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తెలిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Updated : 28 Jan 2024 12:31 IST

గుంటూరు: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ (Galla jayadev) తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న ఆయన.. తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేను. నా పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉంది. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను.. కానీ, రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా. రెండేళ్ల క్రితం మా నాన్న వ్యాపారాల నుంచి రిటైర్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోంది. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నా’’ అని గల్లా జయదేవ్‌ అన్నారు.

ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన ఆయన.. స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకొని ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ‘‘ రాష్ట్ర సమస్యలు, ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌లో పోరాడా. రాజధానిగా అమరావతికే మద్దతిస్తా. ప్రభుత్వం నుంచి బయటకి వచ్చినప్పుడు అవిశ్వాసం పెట్టారు. ఆ సమయంలో పార్టీ గొంతు నేనే వినిపించా. దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ కేసుల్లో ఈడీ నన్ను రెండు సార్లు పిలిచి విచారించింది. నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయి. సీబీఐ, ఈడీ నా ఫోన్‌లు ట్యాప్‌ చేస్తున్నాయి’’ అని జయదేవ్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు