Ganta: ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు.. మరో మోసానికి తెరలేపిన సీఎం జగన్‌: గంటా

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రూప్-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలో మరో కొత్త మోసానికి సీఎం జగన్‌ తెరలేపారని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.

Updated : 09 Dec 2023 16:01 IST

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రూప్-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలో మరో మోసానికి సీఎం జగన్‌ (YS Jagan) తెరలేపారని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa rao) ఆరోపించారు. చివరకు ఉద్యోగాల భర్తీని కూడా రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా ఇష్టానుసారంగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా వైకాపా ప్రభుత్వ తీరుపై గంటా విమర్శలు గుప్పించారు. 

‘‘ఎప్పుడో 2021లో జాబ్ క్యాలెండర్ కింద ప్రకటించిన గ్రూపు-2 నోటిఫికేషన్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేశారు. కొన్నినెలల కిందట ప్రకటించిన గ్రూపు-1 నోటిఫికేషన్‌ను నిన్న జారీ చేశారు. మొన్నటికి మొన్న అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ.. అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు. చివరికి ఆ ఊసే లేకుండా చేశారు. ఇదంతా ఎన్నికల గిమ్మిక్కు కాకుండా మరేమిటి? నోటిఫికేషన్ల ప్రకారం చూస్తే ఫిబ్రవరి 25న గ్రూప్‌-2 ప్రిలిమ్స్.. మార్చి 17న గ్రూప్‌-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఈ రెండింటికీ మెయిన్స్ పరీక్షలను కొత్తగా ఏర్పడే ప్రభుత్వం హయాంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. అంటే.. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే ప్రిలిమ్స్ పరీక్షలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉండదు. ఇదంతా మీకు ముందే తెలుసు. నిరుద్యోగుల భవిష్యత్తును కూడా ఎన్నికల అస్త్రంగానే వాడుకుంటున్నారు.

వైకాపా ప్రభుత్వానికి నిజంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఒక 6 నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేసేవారు. ఒక ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్‌ ఇచ్చి, ఎన్నికల ముందు పరీక్షలు నిర్వహిస్తామనడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుంది. నిరుద్యోగులు గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఈ రెండింటికీ దరఖాస్తు చేసుకుంటారు. గ్రూప్‌-2 సిలబస్‌తో పోల్చితే గ్రూప్‌-1 సిలబస్‌లో అదనపు సబ్జెక్టులుంటాయి. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ జరిగిన 20 రోజుల్లోనే గ్రూప్‌-1 అదనపు సబ్జెక్టులకు అభ్యర్థులు సిద్ధం కావడం చాలా కష్టమని నిరుద్యోగులు వాపోతున్నారు. మీ మోసపూరిత మేనిఫెస్టో మాదిరిగా ఎన్నికల ముందు హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ పరీక్షలకు నిరుద్యోగులు సన్నద్ధం కావటానికి కనీసం 4 నెలలు పడుతుంది. తగిన సమయం ఇవ్వకుండా డిసెంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చి, ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తామంటే ఎలా? చివరికి ఏదోలా కష్టపడి పరీక్షలకు సిద్ధమైతే.. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే వారు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా?’’ అని గంటా ప్రశ్నించారు.

రాష్ట్రంలోని నిరుద్యోగులు అధైర్య పడాల్సిన అవసరం లేదని గంటా శ్రీనివాసరావు ధైర్యం చెప్పారు. ఏపీలో అధికారంలోకి రాబోతోంది చంద్రన్న ప్రభుత్వమేనని.. 2024లో  పోస్టులను భర్తీ చేసే బాధ్యత తెదేపా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని