‘డీఎస్సీపై గుడ్ న్యూస్’ అని మంత్రి బొత్స అన్నారు.. ఎక్కడ ఆ శుభవార్త?: గంటా శ్రీనివాసరావు

ఏపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్‌ వేదికగా గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.

Published : 14 Oct 2023 18:20 IST

విశాఖ: అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం మెగా డీఎస్సీ.. ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీల వర్షం కురిపించారని.. అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు దాటినా వాటిని నెరవేర్చలేదని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో ‘డీఎస్సీపై గుడ్ న్యూస్’ అని మంత్రి బొత్స చెబుతున్నారన్నారు. ఆ రెండు మూడు రోజులు అయిపోయాయని.. మరి గుడ్ న్యూస్ ఎక్కడ? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్‌ వేదికగా గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. 

‘‘నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు? టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు? రాత పరీక్ష ఎప్పుడు? పోస్టులు భర్తీ ఎప్పుడు చేస్తారు? ఎన్నికలు పూర్తయ్యే సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయగలరా? ఎందుకు ఈ వట్టి మాటలు? నిరుద్యోగులను ఎన్ని రోజులని మభ్యపెడతారు? ఎన్నికలు సమీపిస్తున్న వేళ, హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఇదేనా మీ చిత్తశుద్ధి?

2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే 9,061 పోస్టులతో, 2018లో 7,729 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం. 1998, 2008 డీఎస్సీలో ఎంపికైన కాంట్రాక్టు ఉద్యోగులు, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని ఎప్పటి నుంచో వారు పోరాటం చేస్తున్నారు. కనీసం వారి ఉద్యోగాలను అయినా రెగ్యులరైజ్ చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిరుద్యోగుల భవిష్యత్తుకి ఏం ఢోకా లేదు. 2024లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనే. రాష్ట్రంలో అన్ని శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసేది తెలుగుదేశం ప్రభుత్వమే’’ అని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని