Ganta: మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఇప్పుడు ఆమోదిస్తారా?: గంటా శ్రీనివాసరావు

మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆమోదిస్తారా? అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 23 Jan 2024 21:13 IST

అమరావతి: మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆమోదిస్తారా? అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో జగన్‌ ఎంత పిరికివాడో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తీసుకోవాలనే కనీస సంప్రదాయాన్ని కూడా పాటించలేదని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో తెదేపా తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్‌లో ఉండగా.. తాజాగా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే ఆమోదం?

గతంలో తాను స్పీకర్‌ను కలిసినప్పుడు ఆమోదించకుండా ఇప్పుడు ఆమోదించడమేంటని గంటా ప్రశ్నించారు. జగన్‌లో రాజ్యసభ సీట్ల భయం కనిపిస్తోందని విమర్శించారు. 50 మంది వైకాపా ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేస్తారని జగన్‌కు అనుమానంగా ఉన్నట్టుందని ధ్వజమెత్తారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. జగన్‌రెడ్డికి ఆత్మగౌరవం ఉంటే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సవాల్‌ విసిరారు. రాజకీయ లబ్ధికోసం తన రాజీనామాను ఆమోదింపజేసి స్టీల్‌ ప్లాంట్‌ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా అని మండిపడ్డారు. ధైర్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడే ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా? అని నిలదీశారు. అరాచకం చేస్తోన్న వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో తాను ఓటేయాలనుకున్నానని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా తనకున్న అవకాశాలపై న్యాయ సలహా తీసుకుంటానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని