Lok Sabha poll results: దిల్లీలో ‘ఆమ్‌ ఆద్మీ’కి చుక్కెదురు.. మళ్లీ భాజపాదే హవా

Lok Sabha poll results: లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని ఆప్‌నకు చుక్కెదురైంది. భాజపా మళ్లీ ఏడింటికి ఏడు గెలుచుకొని తన హవా చాటింది.

Published : 04 Jun 2024 18:13 IST

Lok Sabha poll results | దిల్లీ: మద్యం కుంభకోణం, సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుతో దేశ రాజధాని దిల్లీ రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అక్రమ అరెస్టులతో భాజపా ప్రతిపక్షాలను తొక్కిపెడుతోందంటూ ఆప్‌ గట్టిగానే ప్రచారం చేసింది. నిరసనలు, ఆందోళనలతో భాజపాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఎన్నికల ప్రచారం కోసమే కేజ్రీవాల్‌ జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చారు. కానీ, అవేవీ ఫలించలేదు. అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన భాజపాకు మాత్రం గట్టి పోటీనివ్వగలిగింది.

ఓటర్ల తీర్పుపై ఆప్‌ నేతలు స్పందించారు. దేశవ్యాప్తంగా వెలువడుతున్న ఫలితాలు భాజపాకు పెద్ద గుణపాఠమని వ్యాఖ్యానించారు. నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. ‘‘దేశ ఓటర్లు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నా. పదేళ్ల భాజపా పాలనలో అధిక ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో విసిగిపోయినట్లు ప్రజలు సందేశమిచ్చారు. వారిని గద్దె దించాలనుకుంటున్నట్లు స్పష్టంచేశారు. ఈ ఫలితాలు భాజపాకు పెద్ద గుణపాఠం.    ‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌’ నినాదం ఇచ్చిన ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు.

మరోవైపు దిల్లీలో ఆప్‌ ఫలితాలపై పార్టీ నేత గోపాల్‌రాయ్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా ప్రతికూల పరిస్థితుల్లో మేం బరిలోకి దిగాం. పంజాబ్‌లో మా ఎంపీ స్థానాలు పెంచుకోబోతున్నాం. దిల్లీలో భాజపాకు గట్టి పోటీనిచ్చాం. 2019తో పోలిస్తే భాజపాకు దక్కే మెజార్టీ తక్కువే’’ అని అన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా, బిహార్‌లో నీతీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని జేడీయూ కీలకపాత్ర పోషించనున్నాయని అంచనా వేశారు. ఇండియా కూటమి త్వరలోనే భేటీయై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం.. దిల్లీలో ఉన్న ఏడు స్థానాలకుగానూ భాజపా ఆరు చోట్ల విజయం సాధించింది. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని