వాళ్లకు వలసవాద మత్తు వదలలేదు

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పెను దూమారం రేపుతోంది. ఈ అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఘాటుగా స్పందించారు.

Updated : 25 Jan 2023 06:29 IST

ప్రభుత్వ వ్యతిరేకులపై కేంద్రమంత్రి రిజిజు విమర్శ

దిల్లీ: ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పెను దూమారం రేపుతోంది. ఈ అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఘాటుగా స్పందించారు. కొంతమంది(ప్రభుత్వ వ్యతిరేకులు)కి వలసవాద మత్తు ఇంకా వదలలేదని.. వారింకా శ్వేతజాతీయలే తమ పాలకులు అని భావిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కొంతమందికి, ఇండియా గురించి.. తెల్లవారు చెప్పిందే వేదం.. భారత సుప్రీం కోర్టు, భారత ప్రజలు చెప్పింది కాదు అని అనుకుంటున్నారు’ అని ట్విటర్‌ వేదికగా చురకలంటించారు. ఈ విషయంపై 300 మంది విశ్రాంత న్యాయమూర్తులు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఆర్మీ మాజీ అధికారులు స్పందించారు. భారతదేశం, దేశ నాయకుడి పట్ల పక్షపాత వైఖరితో బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిందంటూ ఓ ప్రకటనపై సంతకాలు చేశారు.

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ కేరళలో ప్రదర్శన

గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లపై బీబీసీ చిత్రీకరించిన వివాదాస్పద డాక్యుమెంటరీని కేరళలోని వివిధ ప్రాంతాల్లో ఎస్‌ఎఫ్‌ఐతోపాటు వివిధ పార్టీల అనుబంధ సంస్థలు మంగళవారం ప్రదర్శించాయి. దీనిపై మండిపడుతూ భాజపా యువమోర్చా విభాగం పాలక్కాడ్‌, ఎర్నాకుళంలో నిరసనలు చేపట్టింది.

భారత్‌తో ప్రజాస్వామ్య విలువలను పంచుకోవడమే తెలుసు: అమెరికా

వాషింగ్టన్‌: ‘బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీపై మాకు అవగాహన లేదు. కానీ... వాషింగ్టన్‌, దిల్లీలను కలిపే రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య కొనసాగుతున్న విలువల భాగస్వామ్యం గురించి తెలుసు’ అని అమెరికా స్పష్టం చేసింది. డాక్యుమెంటరీపై ఓ పాకిస్థాన్‌ జర్నలిస్టు సోమవారం లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఈ మేరకు స్పందించారు.


వాయుసేన విజయానికి ఇదిగో నిదర్శనం
వీడియా క్లిప్‌ను ట్వీట్‌ చేసిన రిజిజు

దిల్లీ: పాకిస్థాన్‌పై మెరుపుదాడులకు సాక్ష్యమేమిటన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు సమాధానంగా కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం ఓ వీడియో క్లిప్‌ను ట్వీట్‌ చేశారు. ‘బాలాకోట్‌ వైమానిక దాడి విజయవంతమైంది’ అని విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ రఘునందన్‌ నంబియార్‌ చేసిన ప్రకటన అందులో ఉంది. ‘బాలాకోట్‌ వైమానిక దాడి తర్వాత రెండు రోజులకు వాయుసేన పశ్చిమ విభాగం అధిపతిగా బాధ్యతలు స్వీకరించా. మన పైలట్లు వారికి అప్పగించిన బాధ్యతలను, నిర్దేశించిన లక్ష్యాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ విషయంలో అసత్యాలను నమ్మవద్దు’ అని రఘునందన్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విమర్శలకు ఇదే తమ సమాధానమని కిరణ్‌ రిజిజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని