Yuvagalam: డీఎస్పీ కార్యాలయంలో గంటపాటు హైడ్రామా

లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర, కుప్పం బహిరంగ సభకు అనుమతుల విషయమై మంగళవారం ఉదయం 11 నుంచి గంటపాటు పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో హైడ్రామా నడిచింది.

Updated : 25 Jan 2023 10:09 IST

ప్రొసీడింగ్స్‌ను తీసుకునేందుకు తెదేపా నాయకుల నిరాకరణ

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర, కుప్పం బహిరంగ సభకు అనుమతుల విషయమై మంగళవారం ఉదయం 11 నుంచి గంటపాటు పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో హైడ్రామా నడిచింది. చివరకు 12 గంటల సమయంలో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర, సభకు అనుమతులు ఇస్తున్నామని చెబుతూనే షరతులతో కూడిన ప్రొసీడింగ్స్‌ను చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌కు ఇచ్చారు. వారు షరతులను అంగీకరించకపోవడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. పాదయాత్రకు ఆటంకాలు కలిగించేందుకే కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చారంటూ ప్రొసీడింగ్స్‌ను తీసుకోవడానికి తెదేపా నాయకులు నిరాకరించారు. నిబంధనలు ఆమోదయోగ్యం కాదని డీఎస్పీకి చెప్పి కార్యాలయం బయటకు వచ్చారు.

తొలుత యాత్రకు 29... సభకు 22: 27న కుప్పం నుంచి ‘యువగళం’ పాదయాత్రకు లోకేశ్‌ శ్రీకారం చుడతారని, అందుకు అనుమతించాలని రెండు వారాల క్రితమే పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డికి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ వినతిపత్రం అందించారు. పలుమార్లు పోలీసులు సమాచారం కోరడం, ఆయన వాటికి సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. మంగళవారం ఉదయం పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి రావాలంటూ మనోహర్‌, నాని, మాజీ మంత్రి అమరనాథరెడ్డికి సమాచారం అందింది. న్యాయవాదులతో కలిసి మనోహర్‌, నాని అక్కడకు వచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్లు, యాత్ర సందర్భంగా 29, బహిరంగ సభ నిర్వహించడానికి 22 షరతులు, నిబంధనలు పాటించాలని డీఎస్పీ సూచించారు. నిబంధనలేమిటో తెలపాలని నేతలు కోరగా ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ ఈ తరహాలో ఆంక్షలు విధించలేదని నాని, మనోహర్‌ అన్నారు. తాము సాధారణ నిబంధనలే విధించామని డీఎస్పీ సమాధానమిచ్చారు. గంటపాటు చర్చలు జరిగినా కొలిక్కి రాకపోవడంతో సంబంధిత పత్రంపై సంతకం చేయకుండానే మనోహర్‌తో పాటు నాని, న్యాయవాదులు వెనుదిరిగారు.
వాట్సప్‌ ద్వారా... కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులపాటు సాగే లోకేశ్‌ పాదయాత్రతో పాటు బహిరంగ సభకు అనుమతులు ఇచ్చామని డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మధ్యాహ్నం 12.30 గంటలకు మీడియాకు వెల్లడించారు. పాదయాత్రకు 15, బహిరంగ సభకు 14 షరతులు విధించామని చెబుతూ ఉత్తర్వులు విడుదల చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వీటినే మనోహర్‌, నాని, అమరనాథరెడ్డికి వాట్సప్‌ ద్వారా పంపారు. తాము ఆ పత్రాలపై సంతకం చేయలేదని అడ్డంకులు ఎదురైనా ‘యువగళం’  నిర్వహిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని