మోదీ వల్ల బాగుపడింది అదానీ ఒక్కరే
దేశాన్ని భూతలస్వర్గంగా మారుస్తానని చెప్పిన ప్రధాని మోదీ.. అన్ని రకాలుగా ప్రజల్ని మోసగించారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వానిది దుర్మార్గపు పాలన
సెస్సులతో తోలు తీయడమేనా అభివృద్ధి?
అప్పులు, పన్నుల సొమ్ము ఏమైపోయిందో..
జమ్మికుంట బహిరంగసభలో మంత్రి కేటీఆర్
ఈనాడు - కరీంనగర్, వరంగల్, న్యూస్‌టుడే- జమ్మికుంట, కమలాపూర్: దేశాన్ని భూతలస్వర్గంగా మారుస్తానని చెప్పిన ప్రధాని మోదీ.. అన్ని రకాలుగా ప్రజల్ని మోసగించారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రం, హుజూరాబాద్ నియోజకవర్గంలో మంగళవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడుతూ మోదీది దుర్మార్గపు పాలన అని.. ఎన్నో మాయమాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన ఆయన చాంతాడంత హామీలు గుప్పించి.. ఏవీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. తనకు కుటుంబమే లేదని చెప్పిన ఆయనకు అదానీ రూపంలో పెద్ద కుటుంబం ఉందని, మోదీ ప్రాపకం వల్ల ఆయనొక్కరే బాగుపడ్డారని విమర్శించారు. మోదీ అదనపు సెస్సులతో పేద, మధ్యతరగతి ప్రజల తోలు తీసి రూ.30 లక్షల కోట్లు వసూలు చేయించారని.. ఇదేనా అభివృద్ధి అంటూ ప్రశ్నించారు. టికెట్ ఇచ్చినందుకు బండి సంజయ్‌కి మోదీ దేవుడు కావచ్చు. పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఎందుకు దేవుడవుతారని ప్రశ్నించారు. రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడే ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. 14 మంది దేశ ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క మోదీ హయాంలోనే ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు..? ఆ పైసలన్నీ ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో వచ్చిన రూ.30 లక్షల కోట్లు ఏమైపోయాయో వివరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన అరిష్టమంటూ కొన్ని రోజుల కిందట ఈటల రాజేందర్ బాధ కలిగించేలా మాట్లాడారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. 33 మంది పోటీదారులను కాదని ఈటలకు ఆనాడు హుజూరాబాద్‌లో తెరాస అభ్యర్థిగా అవకాశమిస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు కేసీఆర్ పాలనను అరిష్టం అనొచ్చా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇస్తరాకుల మీటింగ్ ఏంటో?
మొన్న భాజపా వాళ్లు నిర్వహించిన ఇస్తరాకుల మీటింగేందని ఆరా తీస్తే అది విస్తారక్‌ల సమావేశం అని తెలిసిందని కేటీఆర్ హేళనగా అన్నారు. ప్రభారీలు, పాలక్‌లు.. పాలకూరలు, ఇస్తరాకులు లాంటి పేర్లున్న పార్టీ మనకెందుకని ప్రశ్నించారు. ‘మన తెలంగాణ పార్టీ పేరు మారింది. భారత్ రాష్ట్ర సమితిగా ఏర్పాటైంది. కానీ జెండా, ఎజెండా మారలేదు. పక్క రాష్ట్రాల్లో కూడా మన నాయకుడి దమ్ము చూపాలి’ అని అన్నారు.
ఎవరి పాలన అరిష్టమో ఆలోచించండి
‘రూ.700 పింఛను ఇచ్చే గుజరాత్ పాలన కావాలా? రూ.2016 ఇచ్చే కేసీఆర్ సర్కారు కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి అని కేటీఆర్ అన్నారు. 66 లక్షల రైతుల ఖాతాల్లో రూ.65 వేల కోట్లు రైతుబంధుగా వేసినందుకు కేసీఆర్ పాలన అరిష్టమా? 700 మంది రైతులను చంపిన మోదీ పాలన అరిష్టమా? ఆలోచించుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ సభలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు కౌశిక్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు.. సోమవారం నుంచే కరీంనగర్ జిల్లాలో భాజపా, కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. జమ్మికుంట సభకు ఓ యువకుడు కమలం గుర్తు, ఈటల రాజేందర్ ఫొటో ఉన్న టీషర్టును ధరించి రావడంతో భారాస కార్యకర్తలు అతనిపై దాడి చేయబోయారు. వారిని పోలీసులు అడ్డుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పర్యటనలో నిరసనలు
* కరీంనగర్‌లో సర్క్యూట్ రెస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేటీఆర్‌ను ఏబీవీపీ నాయకులు అడ్డుకోబోయారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలంటూ నినాదాలు చేసిన వారిని పోలీసులు ఠాణాకు తరలించారు.
* కమలాపూర్ సమీపంలోని గూడూరు కేజీబీవీ కెనాల్ దగ్గర పలువురు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని పక్కకు నెట్టేశారు. ఎన్‌ఎస్‌యూఐ, భారాస నాయకుల మధ్య తోపులాట, స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.
విద్యార్థులతో కాసేపు సరదాగా..
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్ విద్యార్థులతో మమేకమయ్యారు. వారితో కలిసి భోజనం చేశారు. తొలుత రూ.49 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కరీంనగర్ నుంచి మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి కేటీఆర్ హెలికాప్టర్‌లో కమలాపూర్‌కు చేరుకున్నారు. అక్కడ అధికారులు, భారాస నేతలు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం గౌడ కమ్యూనిటీ హాల్, పాత్రికేయుల రెండు పడకగదుల ఇళ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, బస్టాండు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ‘కేసీఆర్ కుల సంఘాల భవన సముదాయం’ ప్రారంభించారు. అక్కడి నుంచి మహాత్మా జ్యోతిబా ఫులే (ఎంజేపీ) బాలికల పాఠశాల భవనం వద్దకు చేరుకున్న కేటీఆర్‌కు విద్యార్థులు మేళతాళాల మధ్య ఘనస్వాగతం పలికారు. అక్కడ ఎంజేపీ బాలికల పాఠశాల, బాలుర పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, డిజిటల్ తరగతి గదులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ ముచ్చటించారు. డ్రోన్‌ల ఉపయోగాలను వారికి వివరించారు. పాఠశాలకు డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్, వేన్నీళ్ల స్నానం చేసేందుకు గీజర్లు కావాలని విద్యార్థులు కోరగా.. ఆ ఏర్పాట్లన్నీ చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. దళిత బంధు లబ్ధిదారుల గాథలతో కరీంనగర్ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రూపొందించిన పుస్తకాన్ని, సీడీని మంత్రి ఆవిష్కరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స
-
Crime News
Crime: అసలే త్రిపుల్ రైడింగ్... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్ వీల్‌తో విన్యాసాలు..
-
General News
Vande Bharat: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్’.. ప్రారంభోత్సవం రోజున ఆగే స్టేషన్లు ఇవే!
-
Movies News
Guna Sekhar: అప్పుడు మోహన్‌బాబు నా ఆఫర్ రిజెక్ట్ చేశారు: గుణశేఖర్