కేంద్ర బడ్జెట్‌.. రాష్ట్ర నాయకుల స్పందన

బడ్జెట్‌ ప్రసంగానికి, వాస్తవ కేటాయింపులకు పొంతన లేదు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు కొత్తమీ కాదు. మహిళా సాధికారతను మేం స్వాగతిస్తాం.

Updated : 02 Feb 2023 07:44 IST

ప్రసంగానికి..కేటాయింపులకు పొంతన లేదు: కేశవరావు

బడ్జెట్‌ ప్రసంగానికి, వాస్తవ కేటాయింపులకు పొంతన లేదు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు కొత్తమీ కాదు. మహిళా సాధికారతను మేం స్వాగతిస్తాం. కానీ అందుకు కేటాయింపులు లేవు. జౌళి రంగంలో తెలంగాణకు అపారమైన అవకాశాలున్నాయి. లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించేందుకు వీలుంది. అయినా ఆ అంశంలో తెలంగాణ ప్రస్తావనే తీసుకురాలేదు. కర్ణాటకలో అప్పర్‌ భద్రకు నిధులు కేటాయించారు. తెలంగాణకు ఎందుకు కేటాయించరు. బడ్జెట్‌లో తెలంగాణను మర్చిపోయారు. ఇది పూర్తిగా జుమ్లాబాజీ (అబద్ధపు) బడ్జెట్‌.


తెలంగాణ వ్యతిరేక బడ్జెట్‌: నామా నాగేశ్వరరావు

ఇది పూర్తిగా రైతులు, గ్రామీణులు, పేదలతోపాటు తెలంగాణ వ్యతిరేక బడ్జెట్‌. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మరిచిపోయింది. కర్ణాటక రాష్ట్రంలో నీటి పారుదల పనులకు రూ.5,300 కోట్లు ఇచ్చారు. మరి మిగతా రాష్ట్రాల్లో కరవు లేదా? ప్రజలు లేరా? అనేది కేంద్రం చెప్పాలి. ఏటా 2 కోట్ల చొప్పున తొమ్మిదేళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటిని ఊడగొడుతున్నారు. నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిన మిషన్‌ భగీరథ], మిషన్‌ కాకతీయలకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పన సహా విభజన హామీల అమల్లో తీవ్ర వివక్ష చూపారు. తెలంగాణకు రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిల ప్రస్తావన లేదు. సిరి ధాన్యల పేరుతో రాగులు, సజ్జలు, కొర్రలు అంటూ మాటలు చెప్పారు. ఆ రైతులకు ఏం చేస్తారు? ఎంత మద్దతు ధర ఇస్తారనేది చెప్పలేదు.


అన్నదాతకు కేంద్రం వెన్నుపోటు: మంత్రి నిరంజన్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం అన్నదాతకు మరోసారి వెన్నుపోటు పొడిచింది. గతేడాదితో పోలిస్తే వ్యవసాయానికి రూ.50 వేల కోట్ల కేటాయింపులు తగ్గించి మరోసారి రైతు వ్యతిరేక ధోరణిని చాటుకుంది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపవుతుందని చెబుతూ వచ్చి, ఇప్పుడు ఆ ఊసెత్తలేదు. పైపెచ్చు ఎరువుల రాయితీకి మంగళం పాడుతోంది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధికి కేటాయింపులు పెంచలేదు. అమలుకాని బీమా పథకానికి మాత్రం రూ.1,249 కోట్లు పెంచారు. సీసీఐకి కేవలం రూ.లక్ష కేటాయించడం పత్తి రైతులకు తీవ్ర అన్యాయం చేయడమే. కోటి మంది రైతులను మూడేళ్లలో సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లిస్తామని, పది వేల బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, మైక్రో ఫర్టిలైజర్‌, పురుగుమందుల తయారీ గొలుసు నెలకొల్పుతామని గొప్పగా ప్రకటించినా రూపాయి కూడా కేటాయించలేదు. రైతులను ప్రత్యామ్నాయ ఎరువుల వైపు మళ్లించే పీఎం ప్రణామ్‌ పథకానికి మొండిచేయి చూపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విస్మరించారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొండిచెయ్యి: మంత్రి కొప్పుల

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొండిచెయ్యి చూపారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి రూ.38 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం దేశవ్యాప్తంగా వారి కోసం బడ్జెట్‌లో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు. మోదీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం, వివక్ష కొనసాగుతోంది.


ఉపాధి హామీ పథకం ఎత్తివేసే పన్నాగం: మంత్రి ఎర్రబెల్లి

ఉపాధిహామీ పథకం నిధుల్లో భారీగా కోత పెట్టారు. ఉపాధిహామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందనేందుకు ఇది ఉదాహరణ.


పసుపు బోర్డు ఊసేది: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఈ దఫా కూడా రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు ఊసే లేకపోవటం దారుణం. నిజామాబాద్‌ ఎంపీ గత ఎన్నికల్లో ఇచ్చిన పసుపు బోర్డు ఏర్పాటు హామీకి మంగళం పాడటం ద్వారా రైతులను వంచనకు గురిచేశారు. రైతులు, పేదలను దగా చేసి అదానీ, అంబానీలను ఆదుకునేలా బడ్జెట్‌ ఉంది. జాతీయ రహదారులకు రూ.1.25 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.18 వేల కోట్లే. తెలంగాణకు భారీగా రహదారులు కేటాయించామని గొప్పలు చెప్పుకునే వారు.. దీనికి ఏం సమాధానం చెబుతారు.


రాష్ట్రానికి నిరాశే: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

గత కొన్ని సంవత్సరాలుగా బడ్జెట్‌ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష కొనసాగిస్తోంది. ఈసారైనా నిధులు కేటాయిస్తుందని అనుకుంటే నిరాశే మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పట్టించుకోలేదు.


ఏ రంగానికీ మేలు చేయలేదు: వినోద్‌కుమార్‌

ఆచరణ సాధ్యంకాని, ఏ రంగానికీ మేలు చేయని బడ్జెట్‌ ఇది. రైల్వే బడ్జెట్‌నూ ఇందులోనే కలపడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ ఒంటెద్దు పోకడలతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటుచేయాలని గత తొమ్మిదేళ్లుగా కోరుతున్నా..వాటి ఊసే లేదు.


ఇది జాతీయ బడ్జెట్టా? కొన్ని రాష్ట్రాలకేనా?: కవిత

తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు బడ్జెట్‌లో ఏమీ ఇవ్వలేదు. ‘సబ్‌ కా సాత్‌’ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నిధులను అన్ని రాష్ట్రాలకు సమానంగా ఎందుకు పంపిణీ చేయడం లేదు? గుజరాత్‌లో గిఫ్ట్‌ సిటీకి 2025 వరకూ పన్ను మినహాయింపును పొడిగించినప్పుడు.. తెలంగాణలో నిమ్జ్‌, ఇతర సెజ్‌లకు అదే సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయరు. దీన్నిబట్టి చూస్తే ఇది జాతీయ బడ్జెట్టా? లేదా కొన్ని రాష్ట్రాలకు మాత్రమేనా? అనే అనుమానం కలుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించడం సంతోషమే. మరి కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేదు. నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని తొమ్మిదేళ్లుగా చెబుతున్నా కేంద్రం పెడచెవిన పెడుతోంది. దేశ ఆర్థిక వృద్ధిని నిర్దేశించని ఇలాంటి బడ్జెట్‌ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇది మోదీ అంకెల గారడి తప్ప మరొకటి కాదు.


ప్రాథమిక ఆరోగ్యాన్ని విస్మరించారు
-కె.సుజాతారావు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్యం వేరు.. ఆసుపత్రులు వేరు. జబ్బులు బారినపడ్డ తర్వాత ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆరోగ్యమంటే అది కాదు.. జబ్బుల రాకుండా తీసుకునే ముందస్తు జాగ్రత్తలే కీలకం. ప్రాథమిక వైద్యానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించకుండా, కేవలం ఆసుపత్రులు నిర్మించుకుంటూ పోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజారోగ్యం బలోపేతానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి నిధుల్లో ప్రాధాన్యత కల్పించి, ప్రాథమిక వైద్య ప్రాధాన్యతను కేంద్రం విస్మరిస్తోంది. 157 నర్సింగ్‌ కళాశాలలను నెలకొల్పడం కొత్త విషయమేమీ కాదు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి కొత్త కొత్త విధానాలతో ముందుకొస్తారని భావించారు. అదేమీ జరగలేదు. ప్రస్తుతం కేవలం దారిద్య్ర రేఖకు దిగువనున్న వర్గాలకే దక్కుతున్న ఆరోగ్య బీమా.. మధ్య తరగతి ప్రజలకు కూడా విస్తరిస్తారని ఆశించిన వారికి ఈ బడ్జెట్‌ నిరాశే మిగిల్చింది. జాతీయ ఆరోగ్య మిషన్‌కు ప్రస్తుతం కేటాయించిన నిధులు, గతేడాది మారిన అంచనా బడ్జెట్‌తో పోలిస్తే తక్కువే.


మహత్తర భవితను కాంక్షిస్తూ..

దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ తీసుకొచ్చిన గొప్ప బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. ప్రజా సంక్షేమాన్ని, దేశాభివృద్ధిని జోడెడ్ల బండిగా ముందుకు తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. అంత్యోదయ, రామరాజ్యం, గరీబ్‌ కల్యాణ్‌, సహకార విధానం, మహిళలు, యువత సాధికారత.. ఇలా ప్రతి రంగాన్నీ స్పృశించారు. ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలను డిజిటలైజ్‌ చేసే ‘భారత్‌ శ్రీ’ పరిధిలో హైదరాబాద్‌లో ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేయనున్నాం.

 కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి


అన్ని వర్గాలకు ప్రాధాన్యం..

ప్రధాని మోదీ చేసేదే చెబుతారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అద్భుతమైన బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దేశాన్ని తీర్చిదిద్దేలా, అన్ని రంగాలకు, వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా ఉందది. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. పన్ను రాయితీల్లో పేద, మధ్యతరగతి వారికి ఊరట కలిగింది. కర్ణాటక ప్రభుత్వం కరవు ప్రాంతంగా చూపినందునే అక్కడ నిధులు కేటాయించారు. తెలంగాణ సర్కారు అలాంటి ప్రతిపాదనలు ఏమైనా పంపిందా? కేంద్ర బడ్జెట్‌ను విమర్శించే ముందు భారాస ప్రభుత్వం తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయాలి. ఫసల్‌ బీమా పథకం ఆమోదించాలి. ట్రిఫుల్‌ ఐటీ నిర్వహణ చేతకాని భారాస ప్రభుత్వం వైద్య కళాశాలలు ఎలా అడుగుతుంది?   

 బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు 


తెలంగాణకు తీవ్ర నైరాశ్యం..

కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చింది. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, ఏదైనా సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాలను విస్మరించారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ ప్రస్తావనా లేదు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మోదీ 2014 ఎన్నికల సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రస్తావించినా నేటికీ జాతీయ హోదా ఇవ్వలేదు. ఎన్నికల జరగనున్న కర్ణాటకకు నిధులు కేటాయించి సాగు సంక్షోభం ఎదుర్కొంటున్న తెలంగాణపై వివక్ష చూపారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంలో భాజపా, భారాస రెండు పార్టీలు దోషులే.

 రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు


ఇది పెత్తందార్లకు అనుకూలం..

కేంద్ర బడ్జెట్‌ దేశంలో అసమానతల్ని మరింతగా పెంచేలా ఉంది. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనం కోసమే రూ.వంద లక్షల కోట్ల అప్పులు తెస్తోంది. కేంద్రంలో భాజపా ప్రవేశపెట్టిన అన్నింట్లో 2023-24 బడ్జెట్‌ అతి చెత్తగా ఉంది. ఇది రైతుల వ్యతిరేక బడ్జెట్‌. తెలంగాణకి సంబంధించి కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, గిరిజన వర్సిటీల గురించి ప్రస్తావనే లేదు. 

కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి


కేంద్ర బడ్జెట్‌ ప్రజావ్యతిరేకం..

కేంద్ర బడ్జెట్‌ దేశంలో పేదరికాన్ని రూపుమాపేలా లేదు. తెలంగాణపై కేంద్రం కక్ష పూనినట్లుగా కనిపిస్తోంది. ఉపాధి హామీ పథకానికి నిధుల్ని రూ.89,400 కోట్ల నుంచి రూ.60వేల కోట్లకు తగ్గించటం దారుణం. నిరుపేదల్ని పట్టించుకోకుండా మోదీ సర్కారు.. కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాల్ని రద్దుచేయటం అన్యాయం. 2023-24 బడ్జెట్‌లో రూ.10,79,971 కోట్లు (24 శాతం) అప్పులపై వడ్డీల కిందే చెల్లిస్తుండడం ఆందోళనకరం. 

-తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌


పెత్తందార్ల అనుకూల బడ్జెట్‌

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో పెట్టిన బడ్జెట్‌ పెత్తందారులకే అనుకూలిస్తుంది. ఇది పేదలకు ఉపకరించేది కానేకాదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ఇచ్చిన వెసులుబాటు..ఇతర రాష్ట్రాలకు ఇవ్వలేదు. మోదీ ఇచ్చిన హామీలకు కేటాయింపులు జరపలేదు. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టలేదు. పేదలకు అన్నం పెట్టే ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెట్టారు.

- మహేష్‌కుమార్‌గౌడ్‌, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు


మైనార్టీల సంక్షేమానికి 38 శాతం నిధుల కోత

కేంద్ర బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు 38 శాతం నిధులు తగ్గించారు. 2022-23 బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి రూ.5,020.50 కోట్లు కేటాయించగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.3,097.60 కోట్లు మాత్రమే ఇచ్చారు. 

-షబ్బీర్‌అలీ,  మాజీమంత్రి


పెద్దలకు దోచిపెట్టే బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌ పేదలను కొట్టి, పెద్దలకు దోచిపెట్టేలా ఉంది. అందులో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. విభజన హామీలమీదా మొండిచేయి చూపారు.ఇలాంటి బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరింత పెరుగుతాయి.

-ఏలేటి మహేశ్వర్‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే


మధ్య తరగతికి నిరాశ

కేంద్ర బడ్జెట్‌ మధ్య తరగతి ప్రజల్ని తీవ్రంగా నిరాశపరిచింది. రైతులు, నిరుద్యోగుల కలల్ని ఛిద్రం చేసింది. కార్పొరేట్‌ వర్గాలను మాత్రమే సంతృప్తిపరిచింది. రైల్వేలైన్ల విషయంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసింది.

- పోటు రంగారావు, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా


తెలుగు రాష్ట్రాలకు అన్యాయం 

తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రానికి దండిగా ఆదాయం వస్తున్నా కేంద్ర బడ్జెట్‌లో విభజన హామీలు, ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు. కర్ణాటకలో ఎన్నికలు ఉండటంతో దానికి భారీగా కేటాయింపులు చేశారు. మహిళల నుంచి డిపాజిట్లు తీసుకుని కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకానికి రూ.30వేల కోట్లు తగ్గించటం రైతులు, వ్యవసాయ కార్మికులకు అన్యాయం చేయటమే. 

-బి. వెంకట్‌, ప్రధాన కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం


వ్యవసాయ నిధులు పెంచాలి

కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైపోతే దేశాన్ని నిలబెట్టింది వ్యవసాయమే. అంతటి కీలక రంగానికి, రైతులకు దన్నుగా నిలవాల్సి ఉన్నా కేంద్ర బడ్జెట్‌ అలా లేదు. వెంటనే దాన్ని సవరించి వ్యవసాయానికి నిధులు పెంచాలి. 

-రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు


ఇది కార్మిక వ్యతిరేక బడ్జెట్‌

ఇది కార్మికులకు మేలు చేసే బడ్జెట్‌ కాదు. కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన 19 నెలల డీఏ బకాయిలు చెల్లింపు అంశాన్ని ప్రస్తావించకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా నిరాశ చెందారు. రూ.10 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వకపోవడం బాధాకరం. జాతీయ పెన్షన్‌ పథకాన్ని రద్దుచేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ గురించి పట్టించుకోలేదు.

-సీహెచ్‌ శంకరరావు, సౌత్‌సెంట్రల్‌ మజ్దూర్‌ యూనియన్‌

 ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, గాంధీభవన్‌


వృద్ధి.. పేదరికం రెండూ చూపారు

దేశంలో ఏడు శాతం వృద్ధి ఉంది. 80 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని చెప్పడం ద్వారా దేశంలో వృద్ధి, పేదరికం ఉందని తేటతెల్లమైంది. ఉపాధి హామీ పథకానికి ఆదరణ ఉన్నా, నిధుల్లో కోతలు పెట్టడాన్ని బట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కేంద్రానికి కనీస అవగాహన లేనట్లు కన్పిస్తోంది.

-కేఆర్‌ సురేశ్‌రెడ్డి, భారాస రాజ్యసభ సభ్యుడు


రూపాయిలో 37 పైసలు అప్పులతో వచ్చేవే

కేంద్ర ప్రభుత్వ రాబడిలో ప్రతి రూపాయికి..37 పైసలు అప్పులతో వచ్చేవే. అందులో 20 పైసలు చేసిన అప్పులకు వడ్డీల రూపంలో కట్టాలి. మూల ధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు కేటాయించడం ద్రవ్యలోటును కప్పిపుచ్చుకునే ప్రయత్నమే.

-గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని