Nara Lokesh: తప్పుడు కేసులపై న్యాయవిచారణ తప్పదు

 యువగళానికి వస్తున్న ప్రజాదరణను చూస్తుంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని.. సీబీఐని చూస్తే ముఖ్యమంత్రి జగన్‌లో రోజురోజుకూ ఇంకా భయం పెరుగుతోందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. 

Updated : 06 Feb 2023 04:18 IST

ఒత్తిళ్లు ఉంటే వీఆర్‌కో, సెలవుపైనో వెళ్లండి
పోలీసులకు నారా లోకేశ్‌ సూచన

ఈనాడు డిజిటల్‌-చిత్తూరు, న్యూస్‌టుడే-ఐరాల, తవణంపల్లె: యువగళానికి వస్తున్న ప్రజాదరణను చూస్తుంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని.. సీబీఐని చూస్తే ముఖ్యమంత్రి జగన్‌లో రోజురోజుకూ ఇంకా భయం పెరుగుతోందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. పాదయాత్ర ప్రారంభమైన 10 రోజులకే తనపై రెండు కేసులు పెట్టారని.. రానున్న 390 రోజుల్లో ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని సూచించారు. జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు మూడు షరతులతోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులు ఇస్తే.. తన పాదయాత్రకు 29 షరతులు విధించారని ఆక్షేపించారు. యువగళానికి స్పందన లేదంటున్న హోంమంత్రి తానేటి వనిత.. యాత్రలో మూడు వాహనాలు, స్టూల్‌ను ఎందుకు సీజ్‌ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్‌కు ధైర్యం ఉంటే పరదాలు, బారికేడ్లు లేకుండా చిత్తూరు జిల్లాలో పర్యటించాలని.. తానూ ఇక్కడే తిరుగుతానని, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తేలిపోతుందన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా పదోరోజు ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా తవణంపల్లె, ఐరాల మండలాల్లో గాండ్ల, యువత, ముస్లిం, బీసీ వర్గాలతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు స్థానికులతో మమేకమయ్యారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం పూతలపట్టు నియోజకవర్గంలో ముగిసిన పాదయాత్ర.. చిత్తూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

మీ కుమార్తెలే విదేశాల్లో చదువుకోవాలా?

‘పలమనేరులో బహిరంగసభ నిర్వహించినందుకు అమరనాథరెడ్డిని ఏ1గా, నన్ను ఏ2గా కేసు పెట్టారు. నన్నే ఏ1గా చూపించి కేసులు నమోదుచేయండి. అక్రమకేసులు పెడుతున్న పోలీసులెవరినీ వదిలిపెట్టం. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లో వీటిని ఎత్తేసి న్యాయవిచారణ చేయిస్తాం. చట్టాన్ని అనుసరించి బాధ్యులైన పోలీసులను సస్పెండో, డిస్మిసో చేస్తాం. మీపై అంతగా ఒత్తిళ్లు ఉంటే వీఆర్‌కో, సెలవుపైనో వెళ్లండి. పేదలూ విదేశాల్లో చదువుకోవాలనే ఉద్దేశంతో మేం విదేశీ విద్యాదీవెన పథకం ప్రారంభించాం. ఏడాది తర్వాత ప్రభుత్వం మారడంతో మరుసటి సంవత్సరానికి విద్యార్థులకు ఫీజులు చెల్లించలేదు. మీ కుమార్తెలే విదేశాల్లో చదువుకోవాలా? పేదల పిల్లలకు ఆ సౌకర్యం ఉండకూడదా? ఇంజినీరింగ్‌ చేసినా ఉద్యోగం రాలేదని దర్శిలో కిరణ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. 31 మంది ఎంపీలున్నా ఏమీ చేయలేని ముఖ్యమంత్రిని ఎక్కడ ఉరేయాలి? ముస్లింలను వైకాపా అన్నిరకాలుగా మోసం చేసింది. శాసనమండలి ఛైర్మన్‌గా షరీఫ్‌ ఉన్నప్పుడు రాజధాని బిల్లులను హౌస్‌కమిటీకి పంపాలని మెజారిటీ సభ్యులు కోరినందుకు ఆయన్ను ఓ మంత్రి కొట్టారు’ అని లోకేశ్‌ ఆక్షేపించారు.

మైనర్లపైనా హత్యాయత్నం కేసులా?

యాదమరి మండలం చినరాయుడుపల్లికి చెందిన తమ కుటుంబాలు తెదేపాలో తిరగడాన్ని ఓర్చుకోలేక వైకాపా నాయకులు ఓ యువతితో ఫిర్యాదుచేయించి హత్యాయత్నం కేసు పెట్టించారని యువకులు ఇర్ఫత్‌ అలీ, అఫ్రోజ్‌, యాసిన్‌, నఫీజ్‌, మక్సూద్‌.. లోకేశ్‌ ఎదుట వాపోయారు. మైనర్లపైనా కేసులు పెట్టారని లోకేశ్‌ దృష్టికి తీసుకురాగా ఆయన ఆశ్చర్యపోయారు. మసీదు ఆక్రమణను అడ్డుకున్నందుకు తమను నమాజ్‌ చేసుకోనీయకుండా, మృతదేహాలను శ్మశానానికీ తీసుకెళ్లకుండా ఇబ్బందులు పెట్టారని సల్మాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లపైనా కేసులు పెట్టడమేంటని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

వేదిక ఏర్పాటుకు అనుమతి లేదంటూ..

తవణంపల్లె మండలం మారేడుపల్లిలో స్థానికులతో లోకేశ్‌ మాట్లాడేందుకు గ్రామస్థులు వేదిక ఏర్పాటుచేయగా అనుమతి లేదంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు. సొంత స్థలంలో వేదిక ఉందని తెలిపినా తొలగించాలని ఆదేశించారు. దీంతో స్థానికులే అక్కడున్న వేదికను తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని