బెదిరింపులు వస్తుంటే ఉన్న గన్‌మెన్‌ను తొలగిస్తారా?

‘నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి.. ఈ పరిస్థితుల్లో అదనపు భద్రత కల్పించకుండా ఉన్న వారిని తొలగిస్తారా? పోలీసులూ అబద్ధాలు ఆడుతున్నారు.

Updated : 06 Feb 2023 08:09 IST

మిగిలిన ఇద్దర్నీ కూడా తీసేసుకోండి.. ఒంటరిగానే తిరుగుతా
వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి ధ్వజం

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ‘నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి.. ఈ పరిస్థితుల్లో అదనపు భద్రత కల్పించకుండా ఉన్న వారిని తొలగిస్తారా? పోలీసులూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు ఎంపీ రఘురామకృష్ణరాజు కంటే పదింతలు ఎక్కువగా వేధింపులు ఉంటాయి. మిగిలిన ఇద్దరు గన్‌మెన్‌నూ మీకు బహుమతిగా పంపించేస్తున్నా. ఇకపై ఒంటరిగానే తిరుగుతా’ అని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అదనంగా ఇచ్చిన ఇద్దరు గన్‌మెన్‌ను వెనక్కి పంపాలని పోలీసు కార్యాలయం నుంచి తాజాగా ఆదేశాలు వచ్చాయన్నారు. తనకు ఇష్టమైన రమేష్‌, ధనుంజయలను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నానన్నారు. విలపిస్తున్న గన్‌మెన్‌ ధనుంజయను ఓదార్చారు. వారి కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లో ఎవరి ఆదేశాలతో వీరిని తొలగించారో తనకు తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. కానీ రెట్టించిన ఉత్సాహం, కసి, పట్టుదలతో ముందుకు సాగుతానన్నారు. రూరల్‌ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలే తనకు రక్షణ అన్నారు. 175కు 175 సీట్లు గెలుస్తామంటున్న ప్రభుత్వ పెద్దలు.. ఒక్క శాసనసభ్యుడు గొంతు వినిపిస్తుంటే ఇంత మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో బెదిరింపు కాల్స్‌ చేయించడం, కేసులు పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. తన బావ కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నాలుగు ప్రశ్నలు అడిగితే.. సమాధానం చెప్పకుండా 40 తిట్లు, శాపనార్థాలు పెట్టారని ఎద్దేవా చేశారు.

అమరావతి రైతుల సంఘీభావం

వైకాపా నుంచి బయటకు వచ్చిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అమరావతి రైతులు సంఘీభావం ప్రకటించారు. రైతులు ఆలూరు శ్రీనివాసరావు, కట్టా రాజేంద్రప్రసాద్‌, కిశోర్‌బాబు, శివరామప్రసాద్‌, కొండిపాటి సీతారామయ్య, పాతూరు గంగాధర్‌, గుర్రం వీరబాబు, ఉమామహేశ్వరరెడ్డి, ఎస్‌.జిలానీబాషా ఆదివారం నెల్లూరు వచ్చారు. ఎమ్మెల్యేకు కండువా కప్పి కొద్దిసేపు చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము పాదయాత్ర సమయంలో అంబాపురంలో వర్షానికి ఇబ్బంది పడుతుంటే వైకాపా ఎమ్మెల్యే అయినా శ్రీధర్‌రెడ్డి వచ్చి పరామర్శించారని తెలిపారు. అందుకే ఇప్పుడు ఆయన్ను కలిసి మద్దతు పలికామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని