రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

ముఖ్యమంత్రి జగన్‌కు ఏ మాత్రం ధైర్యమున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తనతో బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సవాలు విసిరారు.

Updated : 06 Feb 2023 05:45 IST

ముఖ్యమంత్రి జగన్‌కు యనమల సవాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌కు ఏ మాత్రం ధైర్యమున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తనతో బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సవాలు విసిరారు. ఆయనకు ఆర్థికశాఖపై అవగాహనుంటే చర్చకు ముందుకు రావాలన్నారు. ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసంబద్ధంగా మాట్లాడుతున్నారని, ఆయనకు అసలు ఆ శాఖలో ఏం జరుగుతోందో తెలుసా? అని నిలదీశారు. అసలు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది? వాటిలో ఎన్ని కోట్లు దారి మళ్లించారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘మూడున్నరేళ్ల వైకాపా పాలనలో బహిరంగ మార్కెట్‌ ద్వారా ఎన్ని కోట్ల అప్పులు తెచ్చారు? ఆర్‌బీఐ నుంచి తీసుకున్న వేజ్‌ అండ్‌ మీన్స్‌ ఎంత? ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఎంత? వడ్డీ ఎంత కట్టారు? రెవెన్యూ, ప్రాథమిక, ద్రవ్య లోటు ఎంత? ఖర్చు చేసిన మూలధన వ్యయం ఎంత? పీడీ అకౌంట్‌లో నిధులు ఎంత వాడారు? పెండింగ్‌ బిల్స్‌ ఎన్ని ఉన్నాయి? ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్‌, పీఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదు? ఓపెన్‌ బారోయింగ్స్‌, ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ ఎంత? వీటి వివరాలు కాగ్‌కి కూడా ఎందుకివ్వడం లేదు’ అని మండిపడ్డారు. ‘అధిక ద్రవ్యోల్బణమున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఈ మూడున్నరేళ్లలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఎందుకు పెరిగాయి? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిధుల్ని ఎందుకు దారి మళ్లించారు? ఎన్ని కోట్ల రూపాయలు దారి మళ్లించారు? వీటన్నింటిపై సమగ్రంగా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్‌దే’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని