ప్రజాధనం ఆవిరైనా పట్టించుకోని ప్రధాని అవసరమా?

పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధానమంత్రి మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Published : 09 Feb 2023 04:21 IST

మోదీకి పారిశ్రామికవేత్తలపైనే ఎక్కువ మక్కువ
ఎమ్మెల్సీ కవిత విమర్శలు

ఈనాడు, హైదరాబాద్‌: పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధానమంత్రి మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మోదీకి ప్రజలంటే పట్టింపు లేదనీ, తన మిత్రులైన పారిశ్రామికవేత్తలపైనే మక్కువ ఎక్కువనే విషయం ప్రధానమంత్రి ప్రసంగంలో తేటతెల్లమైందని విమర్శించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ఆయన, ఒక్కసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.

నిండు సభలో ప్రధాని అబద్ధాలు

‘‘అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఎస్‌బీఐ రూ.27 వేల కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రూ.7 వేల కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.5,380 కోట్లు.. ఇలా ఏడు జాతీయ బ్యాంకులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51% పడిపోగా, ఎల్‌ఐసీ రూ.18 వేల కోట్లు నష్టపోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకాన్ని ప్రారంభించింది. మొదటి ఏడాది 11.84 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఇచ్చి... తర్వాత నుంచి తగ్గించుకుంటూ వచ్చింది. ఈ ఏడాది 3.87 కోట్ల మందికి మాత్రమే ఇచ్చింది. జగిత్యాల జిల్లా నుంచి అకారణంగా 50 వేల మంది రైతులను, నిజామాబాద్‌ నుంచి 60 వేల మంది రైతులను పీఎం కిసాన్‌ పథకం నుంచి తొలగించారు. కానీ ప్రధాని మోదీ బుధవారం నాటి పార్లమెంటు ప్రసంగంలో.. ఈ ఏడాది కూడా  11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ పథకం అమలు చేశామని నిండు సభలో అబద్ధాలు చెప్పారు’’ అని కవిత ఆరోపించారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని