న్యాయవ్యవస్థపై దాడే.. రిజిజు వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు

న్యాయ వ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలు ఆ వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు.

Published : 20 Mar 2023 04:47 IST

దిల్లీ: న్యాయ వ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలు ఆ వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఒత్తిడిలోకి నెట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ‘కొంత మంది పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు యాక్టివిస్టులతో కలిసి భారత్‌ వ్యతిరేక కూటమిగా వ్యవహరిస్తున్నారు. భారతీయ న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషించేలా ఆ కూటమి ఒత్తిడి తెస్తోంది’ అని శనివారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో న్యాయ మంత్రి వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు ఆదివారం స్పందించాయి.

‘ఇదేం ప్రజాస్వామ్యం? న్యాయ వ్యవస్థను బెదిరించేలా న్యాయ మంత్రి మాట్లాడవచ్చా? ప్రభుత్వానికి న్యాయమూర్తులు తలొగ్గాలని బెదిరిస్తున్నారా? ఇది కచ్చితంగా న్యాయ వ్యవస్థపై ఒత్తిడే. ప్రభుత్వాన్ని విమర్శించడమంటే దేశాన్ని విమర్శించినట్లు కాదు’ అని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ముంబయిలో వ్యాఖ్యానించారు.‘మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఆధారాలుంటే చూపాలి. బెదిరించడం సరికాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. పైగా బ్రిటిషర్లకు మద్దతిచ్చింది. మాకు భారత్‌ అనుకూల, వ్యతిరేకతపై పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ జవహర్‌ సర్కార్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు చట్ట విచ్ఛిన్నకర శక్తిలా మాట్లాడారు. న్యాయ మంత్రే అన్యాయంగా వ్యవహరించారు. ఇది స్వేచ్ఛకు భంగం కలిగించడం కాదా’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. రిజిజు వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌, సీపీఎం నేత థామస్‌ ఐజాక్‌ ఖండించారు.


ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివారికి చోటులేదు: నడ్డా

దిల్లీ: ప్రజాస్వామ్యంలోని అన్ని పరిధులను రాహుల్‌ గాంధీ అతిక్రమించారని, అటువంటి వారికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆయనను ప్రజాస్వామ్య పద్ధతిలోనే పంపేద్దామని పేర్కొన్నారు. చెన్నైలో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ‘జాతీయ యువ పార్లమెంటు’ సదస్సును ఆదివారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ మానసికంగా దెబ్బ తిన్నదని, రాహుల్‌ గాంధీ భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా, ఐరోపాల జోక్యం కోరుతున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని