Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్‌ లేఖ

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ ఎదుట ఇవాళ తాను హాజరుకాలేనని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు.

Published : 24 Mar 2023 11:12 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ ఎదుట ఇవాళ తాను హాజరుకాలేనని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన సిట్‌కు లేఖ రాశారు. సిట్‌ కార్యాలయం నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ సిట్‌ ఎదుట హాజరుకావాల్సిందిగా వార్తా కథనాల ద్వారా తనకు తెలిసిందన్నారు. నోటీసులోని విషయాలను తాను చూడలేదని చెప్పారు. ఎంపీగా పార్లమెంట్‌కు హాజరుకావాల్సిన బాధ్యత తనకుందని.. సమావేశాల దృష్ట్యా ఇవాళ సిట్‌ విచారణకు తాను రాలేనని స్పష్టం చేశారు. హాజరుకు మరో తేదీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్‌కు సెక్షన్‌ 91 సీఆర్‌పీసీ కింద సిట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌లోని సంజయ్‌ నివాసానికి సిట్‌ పోలీసులు మంగళవారం వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవటంతో ఇంటి గోడకు నోటీసులు అతికించారు. గ్రూప్‌-1 ప్రశ్నపత్రాల లీకేజీపై సంజయ్‌ చేసిన ఆరోపణలపై ఈ నెల 21న ఓ దినపత్రికలో కథనం ప్రచురితమైనట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంజయ్‌ స్పందిస్తూ సిట్‌కు లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని